ఈ పుట ఆమోదించబడ్డది

గుర్రం జాషువ కవి

1895

జననీజనకులు: లింగమాంబా, వీరయ్యలు. జన్మస్థానము: వినుకొండ. జననము: 1895 అక్టోబరు 28 తేదీ. కృతులు: 1. ఖండకావ్యము (మూడు భాగములు) 2. పిరదౌసి 3. గబ్బిలము 4. స్వప్నకథ 5. కాందిశీకుడు 6. ముంటాజమహలు 7. నేతాజీ 8. స్వయంవరము 9. బాపూజీ (ఖండ కావ్యములు) 10. వీరాబాయి (చరిత్రాత్మక నాటకము) 11. తెరచాటు (సాంఘికనాటకము) ఇత్యాదులు మొత్తము నేటికి రచితములు 21 గ్రంథములు.

నేడుసాగుచున్న యిరువదవ శతకమునకు ఖండకావ్యశకమని పేరు పెట్టుటలో నాక్షేప ముండదు. మహాకవి కాళిదాసు 'మేఘదూతము' ఈ నూతన శకము మేలుబంతి. ఈకాలమున జనించిన మహాకావ్యములు వ్రేళ్ళలెక్కకు వచ్చునవి. ఖండకావ్యము లసంఖ్యాకములు. అనేక కారణములవలన నేటి పాఠకులు సుకుమార హృదయులైనారు. పాఠకుల చిత్తవృత్తుల కనుగుణముగా రచయితలును. లేదా, కొన్ని హేతువు లుండి రచయితలు కవితలో మితబాషులుగానున్నారు. రచయితల ననుసరించి పఠితులును. నేటికవుల చూపులలో గొత్త మెఱుగు లున్నవి. వా రేఱుకొనవలసిన యితివృత్తములే వేఱు. జాతీయమైన సంచలనము, రాజకీయమైన పరిణామము, భాషీయమైన వికాసము-ఇత్యాదు లెన్నో తెనుగున వెల్లిగొని కవిత్వమున నూత్న మార్గములు లేచినవి. పెఱ వాజ్మయములతో మన కేర్పడిన సాన్నిహిత్యము కూడ నీ నవోదయమునకు బేర్కొన దగిన యాదరువు. దాన, దీన-స్వల్పకాల పఠన సాధ్యమగు ఖండకావ్య గానమునకు నేడు సుప్రచారప్రశస్తులు పరిడవిల్లుచున్నవి. ఖండకావ్యములు రెండు మూడు పద్యములనుండి, రెండు మూడు నూఱుల పద్యముల వఱకు నున్నవి.