ఱేనికై వెదకెడు ఱిక్క చూపులలోన
జెఱవడ్డ నిండుచందురుని పాట
యిట్లు నీ దీన గోపికా హృదయ మంది
రాంతరాళములోన ద్రుళ్లింతలాడు
వేణు నాదంబు వినిపించు విశ్వమోహ
నాకృతి గిశోరగాయకు నరయు చుంటి.
ఇది నాచరితము, విని, నీ
వదరెదు, తొట్రిలెదు, వడకు, దటు నిటు కనులన్
జెదరెడు చూపుల నేదో
వెదకెదు, ఎవ్వతెవు నీపవిటపీస్థలిలోన్.
'అన్వేషణము' అను శీర్షికతోనున్న ఖండకావ్యమునందలి కొన్ని పద్యములివి. ఈరచనలో దొల్లిటి ప్రబంధముల వాసన లేత లేతగా నున్నది. శైలిలో దెనుగుదనము, కొన్ని తలంపులలో గ్రొత్తదనము, సంవిధానములో దియ్యదనము జతగూడి శ్రుతుల కతిథి గౌరవము నొసగుచున్నవి. కృష్ణశాస్త్రిగారి భావన 'అన్వేషణము' తో నారంభమై నేటికి లోతులు ముట్టినది. ఈయన తెలుగు వారి కిచ్చిన కావ్యములు ప్రధానములైనవి : ప్రవాసము ; ఊర్వశి - కృష్ణపక్షము. ఈ కవినుండి యుబికిన యక్షరములు తక్కువ. కాని, వాని బరువెంతో యెక్కువ. ఆయన ప్రత్యక్షరము ముట్టి చూచినచో నార్ద్రమైన యొక్కొక్క కలువపు రేకు చుట్టినటులు తోచును. కాఠిన్యము సహింపని యీ కవి జయదేవుని వలె పదములేఱుకొని, భవభూతి వలె పాడినాడు. క్షీరసాగరము వంటి హృదయము; చెమ్మగిల్లుచున్న కన్నులు! బ్రతుకుపై నిరాశ!
ఏను మరణించుచున్నాను; ఇటు నశించు
నాకొఱకు చెమ్మగిల నయనమ్ములేదు;