గుజురు తుంపర ముత్యాల కాన్క లిడుచు
తరలు సెలయేటి పాటలో దాగియున్న
రాగతత్త్వంబు నామని రాత్రులందు
కూయు కోయిల కడ నేర్చికొందు వనుల.
*
ఇట్టి తత్త్వములో నీ రెడ్డి కవి కోకిలము మధురకావ్యగానముచేసినది. వీరి కృషీవలుడు-పానశాల మున్న యినకృతులు చాల బ్రశస్తికెక్కియున్నవి. పల్లెటూరి రైతుబ్రదుకు 'కృషీవలుడు' కావ్యమున మూట కట్టినట్టులు ముచ్చటగా గనవచ్చును.
అన్నా హాలిక! నీదు జీవితము నెయ్యం బార వర్ణింప మే
కొన్నన్ నిర్ఘర సారవేగమున వాక్పూరంబు మాధుర్య సం
పన్నంబై ప్రవహించు గాని, యితరుల్ భగ్నాశులై యీర్ష్యతో
నన్నుం గర్షక పక్షపాతి యని నిందావాక్యముల్ పల్కరే?
రామి రెడ్డి కవిత్వమునకు హాలికుడు ఉద్దీపకుడైనాడు. గతాను గతిగ మార్గమున సాగక, దేశకాలస్థితులు గుర్తించి తన తీయని కైతలో జానపద వాతావరణము రాణింప జేసిన యీరెడ్డికవి మఱవరానివాడు. ఈయన కవిత వివిధ విషయములయందును బ్రసరించినది. 'ప్రణయాహ్వానము' ఎంతమెత్తగా నున్నదో, చూడనగును:
చంద్రికా ముగ్ధ శర్వరీచ్ఛాయలందు
జీవలోకంబు నుఖసుప్తి చెందుచుండ
కవి మనంబును బ్రకృతియు కలయుచుండ
పోదమా కాంత, సెలయేటి పొదలదరికి.
పులుగులు గూళులం జెదరిపోయిన రెక్కల నొత్తికొంచు, గొం
తులను పరస్పరంబు బిగితో బెనవై చెడి వేళ, నెప్పుడుం
దెలుపని హృద్రహస్యముల తిన్నగ వీనులవిందుసేయ నౌ
చెలి సెలయేటి సైకతిము చేరుదమా, మనకేలి యూతలన్.