ఈ పుట ఆమోదించబడ్డది

సురవరము ప్రతాపరెడ్డి

1896

రెడ్డి వంశీయులు. తలిదండ్రులు: గంగమ్మ, నారాయణరెడ్డి. జన్మస్థానము: గద్వాల సంస్థానములోని బోరవెల్లి. జననము: దుర్ముఖి - అధికజ్యేష్ఠ బహుళ ప్రతిపత్తు. 1896 సం. రచనలు: 1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర. 2. హైందవధర్మవీరులు. 3. రామాయణ విశేషములు. 4. హిందువుల పండుగలు. 5. ప్రజాధికారములు 6. తుకారాము (నాటకము) 7. ఉచ్ఛల విషాదము (నాటకము) 8. యువజన విజ్ఞానం. 9. మొగలాయి కథలు. ఇత్యాదులు.

హైదరాబాదు, ఆంధ్రసాహిత్య రచయితలు - అను తలపులో తొట్టతొలుత సురవరము ప్రతాపరెడ్డిగారు తగిలి వేఱొకరు తట్టెదరు. "ఆంధ్రుల సాంఘికచరిత్ర" గ్రంథరచనతో - మెఱపు మెఱపులుగా విరసియున్న ప్రతాపరెడ్డిగారి యశస్సు స్థిరపడి నిలిచినది. ఇట్టి యుత్తమ రచయిత జీవన సింధువునుండి యథాశక్తి నేఱుకొన్న కొన్ని బిందువులీక్రిందివి.

ప్రతాపరెడ్డి గద్వాల సంస్థానములోని బోరవెల్లి గ్రామములో జన్మించి, యేడేండ్లదాక నచటనే పెరిగెను. మొదటి గురుత్వము తండ్రిది. పిదప నెనిమిదవయేట 'కర్నూలు' లో జేరి 'మెట్రికు' వఱకు విద్యాభ్యాసము. ఎఫ్.ఏ. హైదరాబాదునందు, బి.ఏ. మదరాసు ప్రెసిడెన్సీ కాలేజీయందు చదువుట. భీ.ఏ. వఱకును సంస్కృతము ద్వితీయభాషగా గ్రహించి పఠించుటచే నాభాషలోని మెలకువలు ప్రతాపరెడ్డిగారికి దెలియును. అదిగాక, గురుముఖమున గావ్యపంచకము లఘుకౌముదియును జదువుకొని తమశక్తికి మెఱుగుపెట్టుకొనెను. బి.ఏ. చదువుచుండగనే 'ఉచ్ఛల' నాటకము వీరు సంఘటించిరి. న్యాయవాది పట్టము వడసి హైదరాబాదులోనే, ఉర్దూభాషలో నెనిమిదేండ్లు