ఈ పుట ఆమోదించబడ్డది

ధానము చేయుట తటస్థించినది. ఆప్రదర్శనము చూచినవెంటనే యీతనికి గవితాస్థ యంకురించినది. అదియాది, వేంకటశాస్త్రిగారి యాదరాశీస్సులంది మూడేండ్ల మూడునెలలు గురుకులక్లిష్టుడై సంస్కృతాంధ్రములు చదువుకొనెను. ఆ గురు సేవాప్రసాదము లక్ష్మీకాంతమును నేడు మహారచయితగా దిద్దగలిగినది. 1912 లో , స్కూలుఫైనలు పరీక్షోత్తీర్ణతనంది, వెంటనే 'ఇంటరు'న, చేరజాలక రెండేండ్లకు జేరి 1919 నాటికి పింగళికవి బి.ఏ పట్టభద్రుడయ్యెను. ఆవెంటనే 'నోబిలుపాఠశాల' లో బ్రధానాంధ్రపండితస్థానలాభము. మఱి నాలుగేండ్లకు, కళాశాలలోగూడ నధ్యాపకత. అచట నొకనాలుగేండ్లు. పదపడి మదరాసు విశ్వవిద్యాలయమున దెలుగు పరిశోధక శాఖలో 'ఫెల్లో' పదవి. అది మూడేండ్లతో నయిపోగా, తంజావూరు సరస్వతీమహాలున గూరుచుండి నాయక రాజులనాటి తెలుగు తాటియాకు బొత్తములు చదివి యెన్నో క్రొత్తవిషయములు లక్ష్మీకాంతకవి సేకరించెను. మదరాసులో నుండగనే 1930 లో ఎం.ఏ మొదటి తరగతిలో నుత్తీర్ణుడై యుండిన హేతువున, 1931 సంవత్సరముననే ఆంధ్ర విశ్వవిద్యాలయమువారు - ఏర్పాటు చేసిన తెలుగుశాఖలో నాచార్యస్థాన మొసగిరి. తంజావూరిలో లక్ష్మీకాంతకవి నాడు చదివిన చదువే, ఆంధ్రవిశ్వవిద్యాలయము అచ్చటి వాజ్మయ మంతయు 'కాపీ' చేయించి తెప్పించి ప్రకటింప బూనుకొనునటులు సేయుటకు హేతువైనదని చెప్పెదరు. ఆమహాప్రయత్నమున మొదటిదిగా 'ద్విపదభారతము' మొదటిసంచిక యచ్చునకు వచ్చినది. దానికి లక్ష్మీకాంతముగారి పీఠిక విపులమైనది యున్నది. తంజావూరి యక్షగానములను గురించి యీయన యెంతో వ్రాయగలవారు. శ్రీ ప్రభాకరశాస్త్రి పరిష్కృతమైన 'రంగనాథరామాయణము'నకు వీరి భూమిక యాభరణమై యున్నది. ఎన్నో పీఠకలలో, ఎన్నో పత్త్రికా ప్రచురిత రచనలలో లక్ష్మీకాంతముగారి వాజ్మయపరిశ్రమము విశదమగుచున్నది.