ఈ పుట ఆమోదించబడ్డది

ఎల కోయిల యీల నేర్పగా, పసితెమ్మర సేద తీర్పగా

చెయి చేయి బిగించి యింపుగా, విహరింతము తోడు తోడుగా.

మనరూపము వ్రాయగా సొనల్, మనవేసము దాచగా పొదల్

మనసోపని పచ్చిముచ్చటల్, తనినోవగ చెప్పికొందమో!

కవితలో నవీనరుచులు పొదిగించిన యీ కవికోకిలము ఉస్మానియా విశ్వవిద్యాలయమున నుపన్యాసకుడుగా నుండి ప్రకృతము విశ్రాంతి గయికొనుచుండెను. 'త్రివేణి' లో వీరి ఆంగ్ల రచనలు ప్రచురితము లయినవి. ఆంగ్లసాహిత్యమున లోతులు ముట్టి ప్రాచ్యభాషాపాండిత్యము సంపాదించి సుబ్బారావుగారు కృతిగా బేరుపెంపులు సమార్జించిరి.

"శాంతి నికేతనము" రవీంద్రుడు ఈయక్షరము లాయన యొడలు పొంగించుచుండును. రవీంద్రాస్తమయమునకు 'రాయప్రోలు' ఇటులు వగచినాదు.

సీ. ఆరిపోయినది దివ్య స్నేహశృంగార

దీపంబు నివ్వాళి తీసి నట్లు

పండిరాలినది పక్వప్రసాదఫలంబు

మొలక మోజున క్రమ్మరిలినయట్లు

నిష్క్రమించినది నాందీముఖోజ్జ్వల తార

చిత్రాంక యవనిక చినిగి నట్లు

తెగి జాఱినది జగత్ప్రియ రాగ మాలిక

గాంధర్వ జీవాళి కదలినట్లు

సోలినది శ్రీరవీందుని సుస్వరంబు

వ్రాలినది సుకవీంద్రుని రమ్యరచన

మ్లానమయ్యె నుపాసనామందిరంబు

ఖిన్న మయ్యెను శాంతి నికేతనంబు.

                  *

నిదురించున్ శ్రుతులాసి కిన్నెరలు, వన్నెల్ చిత్రపాత్రంబులన్

చెదురుల్ చిన్నెలు మాఱి, కావ్యకలకంఠీ కంఠరాగబుగ

ద్గదికాలాపము నంది కుందును రవీంద్రా! సర్వసౌభాగ్య సం

పద మానం బగు తావకీన చరితా శ్వాసాంత సంధ్యాగతిన్.

                   _______________