రాయప్రోలు సుబ్బారావు
1892
జననము: 1892. నివాసము: హైదరాబాదు. గ్రంథములు: 1. కవితాంజలి (తృణకంకణము, స్నేహలతాదేవి, స్వప్నకుమారము గల సంపుటము) 2. జడకుచ్చులు 3. మధుకలశము 4. రమ్యాలోకము 5. తెనుగుతోట 6. ఆంధ్రావళి 7. లలిత 8. వనమాల 9. మధురయాత్ర 10. మాధురీదర్శనము - ఇత్యాదులు.
అభినవాంధ్ర కవితావతరణమునకు దారిచూపినవారిలో రాయప్రోలు సుబ్బారావుగా రొకరు. సారస్వత పురోహితులగు సుబ్బారావుగారే యొకజాతి తెలుగుకైతకు 'భావకవిత్వము' అను నామకరణ చేసినట్లు విందుము. నేడు 'భావకవిత్వము' సర్వతోముఖముగా విస్తరిల్లినది. కవిత్వములో నవ్యమార్గము గురుజాడ అప్పారావుగారితో నారంభమైనదని కొందఱు, సుబ్బారావుగారితో బుట్టినదని కొందఱును. అదియెట్టులయినను, సుబ్బారావుగారితో నూతనకవిత్వమున నొకమెఱుగు వచ్చినదని చెప్పవచ్చును. ఈ గౌరవము వారి మీద మనతెనుగు వారిలో జాలమందికి బొందుపడినది. సుబ్బారావుగారి వ్రాతలు క్రొత్తలో యువకవుల హృదయములలో నూతన సంస్కృతి బీజములు నాటినవి. ఈయన కలిగించిన సంస్కారమువలన గలిగిన యెగ్గు లగ్గులు ప్రస్తుతము ముచ్చటింపరాదు.
భావకవిత్వ మనుపేరిలోనే పెద్దపోరు. "భారతాదులలో గవిత్వములేదా? భావములేదా?" అని ప్రశ్నములు చాలబుట్టినవి. అందుగొన్ని సందర్భములేని ప్రశ్నములు. ఆలంకారికదృష్టిలేనివారు మాత్రమే 'భావకవిత్వము' అనుపేరు లెస్సగా లేదనుటకు సాహసింతురు. కాని ఒకటి 'నవ్యకవిత్వము నాస్తిక కవిత్వము' అనునూహ కొందఱిలో కలిగించినది మనవారే. భాషాసంస్కారము బహుస్వల్పముగానున్న కొందఱు