ఈ పుట ఆమోదించబడ్డది

శర్మగారికి, మరల మదరాసునుండి కొమఱ్ఱాజు వారి యాహ్వానము. దుర్నియతి యటులుండి, శర్మగారు చెన్నపురి చేరిన కొలది నాళ్ళకే లక్ష్మణరావుగారి యస్తమయము. అది 1923 సంవత్సరప్రాంతము. 'విజ్ఞాన చంద్రిక' సన్నవడినది. విజ్ఞానసర్వస్వమునకు అదియాది పెక్కేండ్లు శర్మగారు చేసిన కృషి మఱచి పోరానిది. ఈ వ్యవసాయమునకు ఫలముగా ఆంధ్రవిశ్వవిద్యాలయమువారు చరిత్రపరిశీలక పండితులుగా రమ్మని శర్మగారిని పిలిచిరి. వారచట గావించిన యమోఘ పరిశ్రమమునకు సాక్షులు "ఎ ఫర్గాటన్‌చాప్టర్ ఆఫ్ ఆంధ్ర హిస్టరీ" - " ది హిస్టరీ ఆఫ్ ది రెడ్డి కింగ్డమ్స్"- అను రెండు చరిత్రగ్రంథములు.


శర్మగారిది సంస్కృతాంధ్రాంగ్లభాషలలో 'డిగ్రీలు' లేని నిశితప్రజ్ఞ. ఆంధ్రవీరులు, రోహిణీచంద్రగుప్తము, కొన్ని చిన్నకథలు వీరికళారచనాభిరతిని దృష్టాంతీకరించుచున్నవి.


ఈయన చారిత్రకవ్యాసములలో బౌద్ధ సంస్కృతి రూపు కట్టి యున్నది. 'రేడియో' లో బ్రసారితమగు వీరి "ఆంధ్ర దేశ చరిత్ర సంగ్రహము' సంగ్రహమైనను బహూపయోగియగు కూర్పు. సహృదయులు, చరిత్రపరిశీలక శేఖరులు నగు వారి యునికి ప్రకృతము చెన్నపురిలో. నిర్బంధోద్యోగపు టుచ్చులలో నిచ్చలు ఉండలేని స్వతంత్ర జీవులు శర్మగారు. ఆంధ్రచరిత్ర - సంస్కృతులను గూర్చి యింక నెన్నో నూత్నవిషయములు మనకు వా రీయగలరు.


శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారితో శర్మగారికి మంచి నేస్తము. ఆయన 'ఆంధ్ర ప్రశస్తి' యీయనకు గృతియిచ్చుచు నిట్లు వ్రాసెను:-


నీ వనుకోను లేదు, మఱి నే నిది చెప్పను లేదు, కాని య

న్నా, వినవయ్య నేటి కిది నాచిఱు పొత్తము నీకు నంకింతం

బై వెలయింప జేతు హృదయంబులు నీకును నాకు మాతృదే

శావిల దు:ఖ దారితములై శ్రుతిగల్పె విషాద గీతికన్.

                *