ఈ పుట ఆమోదించబడ్డది

యమోఘము, నపూర్వమునగు విమృష్టవిషయ సందోహము మహాగ్రంథమైనది. సాతవాహనులు - చాళుక్యులు - కళింగ గాంగులు - కాకతీయులు - వీరివీరియుగములను గాలించి పరమరహస్యము లెన్నో వెల్లడించిన పరిశోధకతల్లజులు మల్లింపల్లివారు. నిజమున కాయన గొప్ప యుద్యోగములో నుండవలసినది ; లేదా, మహాధనవంతుడుగా నైన నుండగిదనవాడు. ప్రస్తుతమీరెండును నెఱసున్నలు. ఆయనకు విడవరాని మహోద్యోగము పరిశోధన మొక్కటే. ఆయనకున్నమహాధనము ఆంధ్రవాజ్మయ మొక్కటే. తెలుగువారి పూర్వ సంస్కృతి త్రవ్వి త్రవ్వి తండములయిన వ్యాసములలో మనకందిచ్చిన శర్మగారు పూజనీయులు. శాసనపరిశోధకులు, భాషాపరిశీలకులు నైనవారికి సాధారణముగా గళావిలాసములు తెలియవు. అది హేతువుగా,రచనా సౌందర్యమును వారు ప్రదర్శింపలేకపోవుదురు. శర్మగారి కటులు కాదు. ఈయన యెన్నదగిన కళార్ద్రహృదయముగల వ్యక్తి. కవిత్వము లోతు లెఱుగును; కళల నెన్నింటినో పరిచితియున్నది. అందుకే, యీయనరచన సహృదయ హృదయములను స్పందింపజేయు మాధురీ మార్దవములు పొదిగించుకొన్న రచన. గ్రాంథిక - వ్యావహారికములు రెండును వడిగా, వాడిగా వ్రాయగలుగుదురు. గహనములయిన చరిత్రవిషయములు వీరి కవిత్వములోబడి సౌలభ్య వాల్లభ్యములై ప్రజాసాధారణమునకు సుఖలభ్యములగును.ఆవేశోత్సాహములు జనింపజేయు నింపయిన రచన శర్మగారిచేతిలో నున్నది - ముచ్చటకు గొన్ని మచ్చుపంక్తులు:-


"......వామనుడు తనపాదత్రయముచే ముల్లోకముల నావరించినట్లు భారతధర్మ సంస్కృతి యీమూడు ప్రస్థానములయందును దిశాష్టకము నాక్రమించి యతిశయిల్లినది. అప్పటికి నిప్పటికి బ్రపంచ చారిత్రమున ధర్మ సామ్రాజ్యమును స్థాపింప యత్నించిన వారును, స్థాపించినవారు నొక్క భారతీయులే. భారతీయుల ధర్మసంస్కృతి