ఈ పుట ఆమోదించబడ్డది

నారాయణరావుగారు వ్రాసిన గ్రంథములు శతాధికములుగానున్నవి. ఆయన సారస్వతమునకు సంబంధించిన ప్రతిశాఖలోను విలువగల వ్యవసాయముచేసి యెన్నో కృతులు పండించెను. నవలలు - నాటకములు - జీవిత చరిత్రములు - భాషాచరిత్రములు - పద్యకావ్యములు - గేయములు - ఇవన్నియు వ్రాసికొన్నారు. ఉపనిషత్తులు, భగవద్గీత, అధర్వవేదము ననువదించినారు. 'ప్రపంచమతగ్రంథమాల' నెలకొలపి పెఱవాజ్మయములలోని రచనలు తెనుగులోనికి జాల బరివర్తనముచేసి యిచ్చినారు. కురాను షరీపు - జెండావెస్తా ఇత్యాదులు. నారాయణరావుగారి లేఖిని శతాధిక గ్రంథములు సృష్టించినది. ఆయన వాజ్మయ తపస్వి; సారస్వతయాజి; వాజ్మయద్వారమున దేశారాధనము, ఈశ్వరసేవ సాగించుచున్న మహాశయుడు.


శ్రీ రావుగారి కృషిని గుర్తించి బ్రిటిషు దొరతనము 1947 జూనులో 'మహామహోపాధ్యాయ' బిరుదము నిచ్చినది. నాడు ఇండియా ప్రభుత్వము, పరప్రభుత్వములిచ్చిన బిరుదములను నిషేధించినందు వలన వీరు దానిని స్వీకరింపలేదు. 1947 నవంబరులో కాశీ సంస్కృత విద్యాపీఠము 'మహోపాధ్యాయ' బిరుదముతో జోడు సాలువల నిచ్చి రావుగారిని సన్మానించినది. వీరి నాటకరచన, విమర్శన ఫక్కి గమనించి "ఆంధ్ర బెర్నార్డుషా" యనియు వ్యవహరింతురు. సత్యమైన సేవాపరాయణత గల కళాప్రపూర్ణులకు బిరుదభారముతో బనియుండదు. ఓరిమి - పరిశ్రమ పేరిమి - ప్రతిభా వ్యుత్పత్తుల నేరిమి కలసి చిలుకూరి నారాయణరావుపేర వెలసినది. అనంతపురమున, ఆత్రేయాశ్రమ వాసములో సుపవిత్ర జీవితము గడపుచున్న చరితార్థులు వారు.

                             ____________