ఈ పుట ఆమోదించబడ్డది

నవ్యముల్ హృద్యముల్ నర్మగర్భితములౌ

తళుకు పల్కుల తీపి దవిలి చిక్కి

మనసు మైనము చెంద మచ్చుమాయల జల్లు

తెలియని ముగ్ధ చేష్టలకు బ్రమసి


బుద్ధి వెనుకకు జిత్తంబు ముందునకును

బోవు భిన్నత శాంతి గోల్పోయి, తగును

దగద యను నిలుకడ లేమి దాల్మి వొలియ

గోర రాదని తెలిసియు గోరినాడ

జేర రాదని తెలిసియు జేరనాడ.


                   *

మెత్తని, తియ్యని, చల్లని

చిత్తము, జిఱునవుల రుచులు, సిగ్గు మొగము, గ

న్నెత్తని రూపము, హృదయో

న్మత్తత గలిగింప నిట్టి మాటలు ప్రేలెన్.

                  *


రెడ్డిగారి రచనలలో 'ముసలమ్మ మరణము' నకు మంచి యశస్సు వచ్చినది. ఈ చిన్న కబ్బము చెన్నపురి క్రైస్తవ కళాశాలకు సంబంధించిన ఆంధ్రభాషాభిరంజనీ సమాజము నెలకొల్పిన బహుమాన కావ్యపద్ధతిలో నెగ్గినది. నాడు తత్సమాజపోషకుడు సమర్థి రంగయ్యసెట్టి.


బ్రౌను దొరగారు ప్రకటించిన 'అనంతపురచరిత్ర' యను గ్రంథము నుండి యీ యితివృత్తము కైకొన బడెనని రెడ్డిగారు పీఠికలో వ్రాయుచున్నారు. ఈ కృతి బాల్యములో రచింపబడిన దగుటచే బ్రాచీన కావ్యానుకరణఫక్కి ముప్పాలుగానుండెను. హృదయము సూపించు క్రొత్త వర్ణనములును గలవు.