ఈ పుట ఆమోదించబడ్డది

నిండార నెఱపిన పండువెన్నెల దాగి

నవ్వుచు నాతోడ నభమునుండి

గుసగుసల్ వోపుదు కోర్కిమై సురభి శీ

తల మంద మారుతావళుల నుండి

తేనెల దాపుల జానగు పువుల హి

మాశ్రు లుర్లగ జూచె దవనినుండి


ఛట ఛట రవరాజి ప్రుస్ఫుటముగ్గాగ

ననుచితము సేయ గోపింతు వగ్నినుండి

సకల భూత మయాకార సార మహిమ

నీవు లేకయు నాకు నున్నా వెపుడును.


               *

'నవయామిని' రామలింగారెడ్డిగారు 1936 లో రచించిన ఖండకావ్యము. ఇది బిల్హణీయ కావ్యమునకు మార్పుచేసిన కథాసందర్భముగల కృతి. ప్రాచీనకావ్యమగు బిల్హణీయము అనాదరణీయమైన కావ్యమనియు, మంచిదికాదనియు, కల్పన సత్యమునకు నైజమునకు విరుద్ధమనియు రెడ్డిగారి యభిప్రాయము. ఆకథ నంతను సొంతయూహతో మార్పుచేసి "నవయామిని' కూర్పులో బ్రదర్శించినారు. రెడ్డిగారి భావాంబరవీధి విహరించు యామినీ బిల్హణుల ప్రకృతు లివ్వి:-


1. బిల్హణుడు:- పండితుడు. వయస్సు చెల్లినవాడు కాకున్నను కొంతవఱకు ముదిరినవాడు. ధర్మబుద్ధి నిగ్రహశక్తి ఏమాత్రములేని విషయలోలుడుకాడు. నిజశీలము చలితమయ్యె నేని పునరాలోచనమై సమర్థించుకొన జాలిన నిగ్రహపరుండు.


2. యామిని:- వయస్సునను, వర్తనమునను ఆర్య. పరిశుభ్ర మనోగతి గలది. సచ్ఛీల. గయ్యాళి కాదు. మృదుత్వము స్థిరత్వము కలిసిన హృదయము కలది. భావములు వెన్న. పల్కులు తేనెలు. ధర్మసంకల్పము వజ్రము వంటిది.