కట్టమంచి రామలింగారెడ్డి
1880
పాకనాటిరెడ్డి. తండ్రి: సుబ్రహ్మణ్యరెడ్డి. జన్మస్థానము: కట్టమంచి. నివాసము: చిత్తూరు. జననము: 1880. రచనలు: 1. కవిత్వతత్త్వవిచారము 2. వ్యాసమంజరి 3. ముసలమ్మ మరణము 4. నవయామిని (ఖండకావ్యములు) ఇత్యాదులు.
ఒకజాతీయ నాయకుడుగా, అంతర్జాతీయ రాజకీయ వేత్తగా నుండు వాని ప్రశస్తి రామలింగారెడ్డిగారి కున్నది. రచయితగా ఆయనకు గల ప్రసిద్ధియు జక్కనిది. రెడ్డిగారు తెలుగువారే కాని, ఆంగ్లభాషా కోవిదులైన భారతీయు లేపదిమందిలోనో యొకరు. ప్రభుత్వము బహుమాన వేతన మీయగా 'ఇంగ్లండు' నకు బోయి పాశ్చాత్యశాస్త్ర తత్త్వము పుడిసిలించి వచ్చిన పండితు లీయన. ఖండాంతరములలో నున్నను, తెలుగుగలకండపుదీపి మఱచిపోయినవాడు కాడు. అది మన విశ్వవిద్యాలయపు భాగ్యము. రాధాకృష్ణపండితుడు 'ఆక్సుఫర్డు' లో వేదాంత విద్యాగురుత్వము వహించుచున్నను, కాశీ విశ్వకళా పరిష దుపాధ్యక్షతా పదవిలో నున్నను, రష్యా రాయబారిగా నున్నను ఆంధ్ర జనయిత్రి కడుపు చుమ్మలువాఱ గన్నబిడ్డడే!
మన రామలింగారెడ్డిగా రేండ్లతరమున బాశ్చాత్యదేశమున నున్నవారేయైనను మానసములో మాతృపూజ మానలేదు. కళాపూర్ణోదయ కథా సంవిధాన సమీక్ష చేయుచునే యుండెడివాడు. "కవిత్వ తత్త్వవిచార" బీజము లప్పుడే యీయన హృదయక్షేత్రమున బడినవి. పింగళి సూరనార్యునితో గట్టమంచి కవికి బ్రహ్మాండమంత మైత్రి. అందువలననే యతనిలో బొరపాటులని తోచినవి మొగమోటమి లేకుండ మొగముముందఱ జెప్పివైచుటకు సాహసము. ఇది కొంద