ఈ పుట ఆమోదించబడ్డది

బ్రధానపీఠాలంకరణము. ఈ విషయమునుఁ గొందఱు భేదాశయు లుండవచ్చును ! 'చెలియలి కట్ట' లో రత్నావళిని సాహిత్య వేదినిగాను గవయిత్రిగాను వీరు చిత్రించిరి. శాస్త్రి రత్నావళికిఁ జదువు చెప్పెనని చెప్పుచు ఆంగ్లకవులు, ఆంధ్రకవులు, వివిధకావ్యములు మున్నుగా నెన్ని సంగతులో జోడించిరి. ఏదో విధముగాఁ బ్రతికథనమునను సాహిత్య వాసన యనుబంధింపఁ జేయుట వారి యలవాటు. వేయి పడగల లోని ధర్మారావు మహోత్తమాదర్శములుగల భాషావేత్తగాఁ జిత్రితుఁడు. అతఁడు ఆముక్తమాల్యద - పాండురంగమాహాత్మ్యము, భాగవతము మున్నగు తెలుగు గ్రంథముల మీఁద లోతయిన చర్చలు చేయును. విగ్రహారాధనము, స్త్రీ స్వాతంత్ర్యము మొదలయిన సమస్యలెన్నో యిందు విమృష్టములు. ఆయా సిద్ధాంతములు ప్రదర్శించునపుడు సత్యనారాయణగారి కలము మంచి మెలఁకువతోఁబొలపముగా సాగును.


విశ్వనాథవారి నాటకములలో 'నర్తనశాల' కు మంచిపేరు వచ్చినది. ఉత్తరా పాత్ర ప్రవేశ మీ నాటకమున కొక మెఱుఁగు తెచ్చినది. క్షేమేంద్రుని మెప్పింపఁగల యౌచిత్యశోభ సత్యనారాయణగారి రచన కందినది. అనార్కలీ, వేనరాజు, త్రిశూలముం మధుర నాటకములు. 'త్రిశూలము' ప్రారంభమున వీ రిటులు చెప్పుకొనిరి.


          నన్ను నెఱుఁగరొ ! యీ తెల్లనాఁట మీరు
          విశ్వనాధ కులాంబోధి విధుని బహు వి
          చిత్ర చిత్ర ధ్వని బహు విచ్ఛిత్తి మన్మ
          హాకృతి ప్రణేత సత్యనారాయణకవి.


నాటక నవలా రచనలలో నందెవేసిన యీ చేయి పద్యకావ్యరచనలోఁ గూడఁ బటుతరమైన పదవి నందుకొనఁ గలుగుట విశేషము. సత్యనారాయణగారి ఆంధ్రప్రశస్తి, ఆంధ్రపౌరుషము తొలినాళ్ళలోఁ బారాయణ గ్రంథములుగా నుండెడివి. ఎందఱికో యందలి పద్యములు కంఠస్థ