ఈ పుట ఆమోదించబడ్డది

వెలయుగీముల నిండారు వేడ్కలలర

రోహిణీదేవీ శచియు నరుంధతియు వె

లందిలోకంబులందు వలంతులగుట

మాఘమున గ్రుంకువెట్టిన మహిమగాదె;

[పెండ్లికాలపు బేరటాండ్రవర్ణనము]


సీ. పసిమి జగ్గుల యొడల్ పసుపునీట దొలంచి

గడిమడుంగులు రింగు లడరగట్టి

జిలుగుపట్టంచురైకలు గుత్తముగ దొడ్గి

వలతికుంకుమబొట్టు లలరవెట్టి

విరిగుత్తిగుబ్బల విరిసరుల్ ఠవణించి

పలుచగందమ్ము చెక్కుల నలంది

క్రొమ్ముడి గెందమ్మి ఱెమ్మ లిమ్ముగ జెక్కి

పసుపు బారాణిని పదముల నిడి

మృదులవాక్కుల వినయమ్ము జదురపఱిచి

కులపురంధ్రుల నట్టింట నిలిచినపుడె

సదన మతిదీప్యమానమై సందడించె

బెండిలికి బేరటాండ్రొకో నిండుసొగసు.


ఈ నిరంజనకవి తన గోత్రఋషియగు సానగ మహర్షిని బ్రతి గ్రంథాదిని ప్రార్థించెను. ఇతడు విశ్వబ్రాహ్మణసంఘము నుద్ధరించుటకు 'ప్రబోధిని' యనుపత్రిక 1907 నుండి నడపనారంభించెను. మహాసభలజేయించెను. ఏతత్పత్త్రికాద్వారమునను, సభాసమావేశమూలమునను విశ్వబ్రాహ్మణ సమాజమునకు నిరంజనకవి గావించినసేవ గొప్పదని చెప్ప విందుము. ఇతడు దుగ్గిరాల స్థానిక సంఘోన్నత పాఠశాలలో బ్రధానాంథ్రోపాధ్యాయుడుగా నించుమించు పదునైదుసంవత్సరములు పనిచేసెను.