గీ. సిద్ధ సాధ్య భేదంబుల జెలగుసున్న
యర్ధ పూర్ణరూపంబుల నగు ద్వివిధము ;
హ్రస్వముపయి ఖండంబు పూర్ణంబు నగును ;
గాదు ఖండంబున కది దీర్ఘంబు మీద.
నారాయణశాస్త్రిగారు పీఠికాపురసంస్థాన విద్వత్కవు లగువేంకట రామకృష్ణకవుల గురువులు. శాస్త్రిగారు తెనుగుపరచిన ' మహిష శతకము ' చక్కని గ్రంథము. మహిషము మీద బెట్టి దురధికారులను దూషించు నన్యాపదేశ శతక మది. అనువాదమే యైనను గవితాధోరణి సాధుమధురముగా నున్నది.
ఉ. కొండొక దున్నపోతు నిను గూర్చి ప్రబంధశతంబు జ్యయ ను
ద్దండత నుత్సహింతు నిది త్వన్మహిమంబున జేసికాదు ; క్రూ
రుం డొక డాధికారికుడు ద్రోహమొనర్పగ గోపగించి వా
గ్దండము ద్వత్తిరస్కృతిపథంబున దుష్ప్రభులందు వైవగన్.
చ. అతివిభవాభిమానులు దురాగ్రహు లంతిమ జాతిసంభవుల్
వితత కఠోరభాషణులు వేరలొ యా చెడుగండ్ల మోములన్
క్షితి బరికించుకంటె బరికించుట మేలగు నీదు పృష్ఠ ; మ
క్కతమున బొట్టనిండ దొరకంగల దన్నము సైరిభేశ్వరా !
ఉ. సైరిభ ! నీవు తాపమునుసైచి గడింపగ ధాన్యముల్ సుబే
దారుడు కొంతసొమ్మువలె దత్సకలంబు హరించెడున్ బలా
త్కారము జేసి, దాని కొకకారణ మున్నది విన్ము పిత్ర్యమున్
దారకులే హరింతురు గదా విభు జెల్మినొ కల్మినొ లేక బల్మినో.
ఈతీరుగల శయ్యలో దూతాంగదము, భర్తృహరినిర్వేదము శాస్త్రిగారు తెనుగున ననువదించిరి. ఇవియెల్ల నొకయెత్తు ; నారాయణ శాస్త్రిగారి నారాయణీయాంధ్ర వ్యాకరణ మొకయెత్తును. తెలుగు లాక్షణికులలో శాస్త్రిగారి కీర్తి నిలబడుట కీ కూర్పు చాలును.