చర్ల నారాయణ శాస్త్రి
1881 - 1932
ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణుడు. జన్మస్థానము: కాకరపర్రు. తల్లి: వెంకమ్మ. తండ్రి: జనార్ధనశాస్త్రి. జననము 1881, వృష సంవత్సరము. నిర్యాణము: 27 నవంబరు 1939. రచనలు: 1. వృషభ శతకము (ఆంధ్రీకరణము) 2. నారాయణీయాంధ్ర వ్యాకరనము. 3. దూతాంగదము (ఆంధ్రీకృతనాటకము) 4. భర్తృహరి నిర్వేదము (ఆంధ్రీకృతనాటకము) 5. కావ్యాదర్శము 6. నీలకంఠవిజయ చంపువు 7. మహాభారత మీమాంస (మొదటి రెండు కృతులే ముద్రితములైనవి. తక్కినవి యింకను ముద్రింపబడలేదు).
నారాయణ శాస్త్రిగారు మంచి విమర్శకులు గాను, పండితులు గాను పేరుగాంచిరి. కవిగా వారికి గలపేరు తక్కువ. ఆయన శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయమున బండితాధికారిగా బెక్కునాళ్లు పనిచేసి భారతికి గావించిన సేవ గొప్పవిలువ గలది.
"మేకాధీశ" శబ్దార్థమున సకలప్రపంచమును జోడించి చూపిన మహావిద్వాంసుడు చర్ల భాష్యకారశాస్త్రి మున్నగువారికి నెలవైన ' కాకరపర్రు ' నారాయణశాస్త్రిగారి యూరు. ఈయన పితామహుని సన్నిధిని కావ్యములు చదువుకొని, ఆకొండి వ్యాసలింగశాస్త్రితో నలంకార గ్రంథములు పాఠముచేసి, రామడుగుల వీరయ్యశాస్త్రి గురువుల దగ్గర వ్యాకరణ మభ్యసించి పండితస్థానము నందెను. సంస్కృతాంధ్రములలో నిశితమైన పాండితీపాటవము. ఈ పాండిత్యమునకు దోడు సంగీతాది కళలలో గూడ జక్కని పరిచయము. మద్దెల వాయించుటయు గురుముఖమున నేర్చినారు. అంతటి కళాభిరుచి ! ఒక చిత్ర మేమనగా, నారాయణశాస్త్రిగారు నాడు ధైర్యవంతుడైన సంస్కారవాది. తణుకులో జరిగిన అస్పృశ్యతా నివారణ మహాసభకు ఆహ్వాన సంఘాధ్యక్షత వీరిదే. ఆసమయము 1925 ప్రాంతము. సహాయ నిరాకరణోద్యమములో వీరు నడుము కట్టి పనిచేసినారు. కాకరపర్రు