ఈ పుట ఆమోదించబడ్డది

ప్రసాదరాయ కవి 'మొయలురాయబారము' విక్రమదేవవర్మ కంకితము గావించెను. కృతికర్తయు, కృతిభర్తయు నగుట మంచియదృష్టము. అది పట్టిన మహారాజు విక్రమదేవవర్మ సంస్కృతాంధ్రములు, ఆంగ్లము కాక 'హిందీ' కూడ వీరికి సుపరిచతమైన భాష. తులసీదాసుని వర్షఋతు వర్ణనము, శరదృతువర్ణనము పద్యరూపముగా వీ రనువదించిరి. బహుభాషాప్రవేశము గలవారే యసలు తక్కువ; మహారాజులలో మఱియు దక్కువ.


శ్రీ విక్రమ దేవవర్మగారు పూరించిన యీసమస్యలు కొన్ని మీముందుపెట్టెదను. ఆయన యెట్టియాలోచన కలవారో నిర్ణయించుకొనుడు.


సమస్య:-కొడుకును దా వలచి యొక్కకూతుం గనియెన్.

క. పుడమికి మేనక యనియెడు

పడతుక దివినుండి వచ్చి పావనమగు కా

ఱడవిని నృపుడగు కుశికుని

కొడుకును దా వలచి యొక్కకూతుం గనియెన్.

సమస్య:-అంధుడు భాస్కరునిజూచి యానందించెన్.


క. అంధత్వహరుండగు రవి

బంధురకృప గ్రుడ్డితనము వాయగ గవితా

సింధుపు మయూరు డనెడు పు

రాంధుడు భాస్కరుని జూచి యానందించెన్.

సమస్య:-తల్లీ! దండం బటంచు దారకు మ్రొక్కెన్.


క. ముల్లో కంబుల మేలున

కల్ల మహిష దనుజు జంపు మను తఱియందే

యెల్ల సురలతో భర్గుడు

తల్లీ! దండం బటంచు దారకు మ్రొక్కెన్.