ఈ పుట ఆమోదించబడ్డది

విని శివాజీ పలవించిన ప్రకరణము చదివికొని కటికవాడు కంటనీరు పెట్టుకొనును. భారతములో, నభిమన్యువధ విన్న యర్జునుడు సైత మట్టు లేడువలేకపోయినాడేమో!


సీ. పరతంత్రతాభుగ్న భారతోద్ధరణోద్య

మమున నా నాయకత్వము వరించి

యెనలేని నీసర్వధన జనబల జీవి

తముల నర్వార్పణ ధారవోసి

రణరంగముల సంగరక్షకతన్ బొంచి

కనుఱెప్పవోలె నన్న నుసరించి

దుస్సాధతర వైరి దుర్గ భేదన వజ్ర

పాతమై బహుళాహవముల గెలిచి


యనుచరుండు-చమూనాథు-డంగరక్ష

కుడు-బహి:ప్రాణ మనగ నన్ గొలుచు నిన్ను

గోలుపోయినయపుడ నే గోలుపోని

దొకటి యున్నదే? తానజీ! యొంటినైతి.


గీ. శివపతి యెవండు? తానాజీస్నిగ్ధహృదయ

బలము ద్రావి, పెన్పొందిన భద్రమూర్తి,

నిజము : తానాజీ! యీనాడు నీవులేని

శివపతి యెవండొ! యెంతలో పవలు-రేయి.

                  *


శా. తానా! నీవిక బల్క, నీహృదయ బాథల్ తీఱు తీరేది? నీ

దీనానాథ కుటుంబ శోకదహనార్తిన్ బాపు ప్రాపేది? నా

పైనం బైకొను శత్రుసంహతుల గూల్పం డెంపు పెంపేది? య

న్నా! నీయొక్కనిలేమి యెల్లెడల దానై యెంత గుందించెడిన్.