1920-1930 సంవత్సరముల నడిమికాల మది. 1932 నుండి ప్రొద్దుటూరు మ్యునిసిపలు హైస్కూలులో శేషశాస్త్రిగారికి బండితపదవి కుదురుపడినది. నాలుగయిదవధానములు చేసినంతమాత్రాన, పాఠశాలలో బండితులైన మాత్రాన, అనుకరణధోరణిలో నేవో ప్రబంధములు రచించినంతమాత్రాన శేషశాస్త్రిగారి ప్రతిభోన్నతి తెలుగు జగ మేమియెఱుగును?
వసంతమునగాని రసాలమువైపు తుమ్మెదలు చూడవు. కోకిలము గొంతెత్తదు. "..వృక్షన్య సంపుష్పితన్య దూరాద్గంధోవాతి.-" పేరుప్రతిష్టలకు దేశకాలములు ప్రధానకారణము. 1943 లో 'శ్రీ శివభారతము' వెలువడినది. అదిచూచి, తెలుగుమహాకవులెల్ల తెల్లతెల్ల వోయిరి. 'ఇట్టి మహాకవి యీవఱకు బుట్టలేదని కాదు,' ఇన్నాళ్ల దాక నీ కవితావసంతు డేసందులోనుండె" నని. క్రమముగా నేటికి శేషశాస్త్రిగారి నెఱుగని పండితుడు, తెలియని కవి, వినని తెనుగు రసికుడు కోటి కొకడుండునేమో! ఆయన 'శివభారత' కవిత సాహిత్య సభలలో గానముచేయుచున్నారు. హరికథగా బాడుకొనుచున్నారు. పురాణముగా బారాయణము గావించుచున్నారు. విన్నంతలో, కన్నంతలో శేషశాస్త్రిగారి యీడు అయిదవపడి పై బడినది. శివభారత మించుమించు నాలుగు దశాబ్దుల భారతీతపస్సు. ఈకృతి శతాబ్దులు, సహస్రాబ్దులు తెలుగువారల కడుపులు నిండించు రాయలసీమ పంట. గ్రంథకర్త విజ్ఞప్తి యిటు లున్నది:
'......ఈగ్రంథరచనవఱకు నదియొక కవితాతపస్సు. మూడుపర్వముల ప్రాయముతో అరణ్య - అజ్ఞాతవాసముల సంస్కారముతో బక్వమయిన భారతగాధ-అది. సోమయాజి కవిత్వమున ఉత్తరగోగ్రహణముతో విధిగా వీ శివ్రభారతరచనయారంభమైనది. ఇంతయు ధర్మదేవతా