ఈ పుట ఆమోదించబడ్డది

ప్రదానము గావించెనో, ఆయుద్దిష్ట కవి దృష్టికి మాత్రము 'ఆత్మన్యప్రత్యయం చేత' అనునక్షరములు తాటికాయలంత లేసి కనబడుననుట వాస్తవము. ఆ తీరున నారయని వాడు అంతర్ముఖుడు కానివాడు.


శ్రీ రాజశేఖరకవి నావిమర్శన పథములో బెక్కుచోట్ల మహాకవి, అక్కడక్కడ కవి. ఒకానొక కవి తనజీవితమునెల్ల నొకే గ్రంథములో దాచబెట్టును. ఒకడు దానినే చిన్నచిన్న పది గ్రంథములకు బంచి యిచ్చును. అసలు, ఒకడు గ్రంథములో బ్రతుకే పోయలేక పోవును. సంపూర్ణజీవదాతృత్వము గలమహాకవి జీమూతావాహనుని వంటివాడు. అతని వితరణమునకు బ్రహ్మాండ సుందరి హారతి పట్టును. జీవనదాతలగు కవులు నలువురున్న జాలును. దేశము సువర్ణము పండును. మన రాజశేఖరకవి జీవనప్రదాత. ఆయన సారస్వతజీవితము రెండుగా వింగడించి వ్రాయబడుచున్నది. ఇందు, పూర్వార్థము జీవి. ఉత్తరార్థము జీవుడు నని కోవిదులకు వేఱుగా వివరింప నక్కఱయుండదు.


వీరికి బ్రాథమికవిద్య ప్రసాదించిన యూళ్ళు జమ్ములమడుగు - ప్రొద్దుటూరును. తరువాత గడప హైస్కూలులో జదివి 1907 సం. లో 'మెట్రిక్యులేషను' పరీక్షయందు నెగ్గి యాంగ్లముమీది మక్కువ యింకను జదువు మని హెచ్చరింపగా, మదరాసు క్రిస్టియన్ కళాశాలలో ఎఫ్. ఏ. చదువుటకు బ్రవేశించిరి. "నాయనా ! నాకడుపున బుట్టినబిడ్డడవు. సవతాలి పలుకులకు మరగితివా ?" యని తెలుగుదల్లి యెకనాడు రాజశేఖరుని బుజ్జగించి చెప్పినది. ఆనాటినుండి యాంగ్లపు జదువునకు స్వస్తి చెప్పి వెనుకకువచ్చి వైచెను. ఈలోపున 1904 - 07 పరమ కందాళ్ళ దాసాచార్యులుగారి సన్నిధిని సంస్కృతాంధ్ర సాహితీగ్రంథములు పాఠముచేసి కవిత్వము కట్టుటలో దిట్టతనము సంపాదించిరి. కళాప్రపూర్ణ జనమంచి శేషాద్రిశర్మగారికడ గూడ గొన్ని దినములు చదివిరి. 1908 లో ఆంగ్లము చదువు విరమించి మదరాసునుండి వచ్చి