ఈ పుట ఆమోదించబడ్డది

"తలచుచున్నాను నా ప్రియతమ వటంచు
ఎంచుచున్నాను నిన్ హృదయేశ్వరి గను
వలచుచున్నాను జీవితేశ్వరిగ నిన్ను
భావనము సేయుచుంటి నిన్ దేవిరీతి.
నీవు ప్రాణాధికవు నాకు నిశ్చయముగ
వాంచనీయ సుఖాధి దైవతమ వీవు
సాటిగానని నా సరస్వతివి నీవు
వాస్తవమ్ముగ భాగ్య దేవతవు నాకు.
నిన్ను బ్రేమించుచున్నాను నిశ్చయముగ
నీ యెడ జెలంగు నా ప్రేమ నిర్మలంబు
నిండు హృదయంబుతో నన్ను నీకే మున్ను
అర్పణము చేసికొంటి సహర్షముగను."


బిల్హణుని కథ పద్యనాటికగా వీరు సంతరించిరి. దాని పేరు కవిప్రియ. బహుళముగా బద్యనాటికా రచనమే శాస్త్రిగారి కిష్టము. సంభాషణము సర్వము ఛందోబంధితమై యుండుటచే గవిత్వ చారుత్వము కొంత కొరవడియుండుట సహజము. వీరి "కావ్యావళి" ప్రథమ భాగము ముద్రిత మైనది. భానుమతి, లోపాముద్ర, శిష్యురాలు ఇత్యాది శీర్షికలతో వీరేరుకొన్న ప్రతి చరిత్రయు బ్రాచీన సంస్కృతిని గురుతింప జేయునవి. రచన ప్రాబంధిక ధోరణీ ననాథము. "దివ్యలోచనాలు" అను ఖండకావ్యములోని యీ వృత్తములు చిత్తరంజకములు.


భగవద్రామానుజులు


పరమాకారణ జాయమాన కరుణాపాంగ ప్రసారంబునన్
భరితా జ్ఞాన దురంత సంతసమునన్ భంజించుచున్, విష్టవ
స్థిర సంరక్షన భార మూనిన మహాశ్రీరంగనాథా! భవ
చ్ఛరణాంబ్జంబుల కే నొనర్చెద నమస్కారంబు భక్తప్రియా!