ఈ పుట ఆమోదించబడ్డది

అంతనుంది శివరామకవి యుత్సాహము సన్నగిల్లెను. అగ్నిప్రమాదమున కొకసంవత్సరము వెనుకనే యేకాంతవాసము కోరి మనశాస్త్రిగారు సూరవరమున నొకతోటకొని యం దిల్లుగట్టి నాలుగేండ్లం దొంటరిగ నుండిరి. మొదటియింటిపై నగ్ని కోపించినతరువాత భార్యతో దోటయందే కాపురము స్థిరపడెను. ఏకాంతవాసమున కీకవి యిటులు పలవరించును:


ఉ. ఏయొకరుండు లేని యొక యేటినమీపతలంబునం దర

ణ్యాయతనంబునందును దటాకతటంబున యందు దోటయం

దా యతశైలశృంగమునయందు జనించు మహావనీజమం

దూయెల యొండు నాసనము నొండును దప్పక నాకుగావలెన్.


శివరామ శాస్త్రిగారు వ్యుత్పత్తియు ప్రతిభావమునుగల కవి. భావనలో వారికి దీటు వచ్చువారు నేటివారిలో దక్కువగనున్నారు. "ఒక్కభాషగాదు తక్కినభాషల నన్నిగూడ నేర్వుమయ్య యాంధ్ర" యని ప్రబోధించి యన్యవాజ్మయము లెన్నిటి తోడనో పరిచయము గలిగించుకొన్న కవివరుడాయన. రవీంద్రుడు వంగభాషలో రచించిన 'కథా' యను గ్రంథమును 'కథలు, గాథలు' అనుపేరు పెట్టి తెనిగించెను. శ్రీ శరచ్చంద్రుని నవల లెన్నో తెలుగులోనికి మార్చెను. పరాసు వాజ్మయపు బోకడలతో గథలు వచనమున వందలు వ్రాసెను. అన్నిరచనలయందు దెలుగు స్వతంత్రతను ముద్రించుకొనెను గాని, యనువాదము లనిపించునట్లు రచింపలేదు. తెలుగు పలుకు చదువని యాంధ్రు నీ కవిగారు సహింపక యీ విధముగ నిలువదీయుచున్నారు.


క. తెలివికి సంస్కృతమున్ మఱి

కలిమికి నాంగ్లేయమో యింకం దురకంబో