వేంకట రామకృష్ణ కవులు
1883 - 1939
1889 - 1918
మొదటివారు ఓలేటి వేంకటరామశాస్త్రిగారు. రెండవవారు వేదుల రామకృష్ణశాస్త్రిగారు. వీరు మేనత్త మేనమామ బిడ్డలు (వేంకట రామశాస్త్రి తండ్రి రామకృష్ణశాస్త్రి మేనమామ. రామకృష్ణశాస్త్రి తల్లి వేంకటరామశాస్త్రికి మేనత్త) ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణులు. మొదటికవి జన్మస్థానము: పల్లిపాలెము (కాకినాడ తాలూకా) తల్లి: కామేశ్వరమ్మ. తండ్రి: నారాయణశాస్త్రి. జననము: 15-11-1883 సం|| అస్తమయము: 3-12-1939 సం|| రెండవకవి యభిజననము: కాకరపర్రు (తణుకు తాలూకా) తల్లి: సూరమ్మ. తండ్రి: రామచంద్రశాస్త్రి. జననము: 1889. నిర్యాణము: 1918. ఈ జంటకవుల నివాసగ్రామము పిఠాపురము. విరచితగ్రంథములు: వ్యాసాభ్యుదయము, దమయంతీ కల్యాణము (అచ్చతెలుగు కావ్యము) విశ్వగుణాదర్శము, ఉత్తరరామచరిత్ర, మదాలస, దమయంతి, ఇందిరాదేవి, శకుంతల, సుభద్ర, భోజచరిత్ర, కాత్యాయన చరిత్ర, కవికంఠాభరణము, సువృత్తి తిలకము, పాణిగృహీతి, కొండవీటి దండయాత్ర, అత్యద్భుత శతావధానము, శతఘ్ని, అట్టహాసము, పరాస్తపాశుపతము, రామకృష్ణ మహాభారతము, ఆంధ్ర కథాసరిత్సాగరము (6 లంబకములు) ఇత్యాదులు.
ఆంధ్రభోజుని యాస్థాన విద్వత్కవులగు వేంకట రామకృష్ణ కవుల కవితాప్రతిభ, విమర్శనశక్తి తెలుగువారికి దెలిసియే యుండును. 1909 సంవత్సరమున రామకృష్ణులు పిఠాపురసంస్థానమున బ్రవేశించిరి. నాటికి వేంకటరామశాస్త్రిగారి వయస్సు ఇరువదియాఱు వత్సరములకు మించదు. రామకృష్ణశాస్త్రిగారికి బదునెనిమిది దేండ్లు దాటినవి. సంస్థాన ప్రభువులు శ్రీ రావు వేంకట కుమార మహిపతి సూర్యరాయేంద్రు వీ కవకవుల బుద్ధి చాకచక్యమునకు గవితాధోరణికి నానందపడి యవధానవిశేషముల గాంచుట కనుమతించిరి.