ఈ పుట ఆమోదించబడ్డది

గఱపెను. తదాదిగ నీ దేవరాజు ప్రాచీన కావ్యములు, శతకములు, భారత భాగవతాది పురాణములు పాఠ భేదములతో సరిచూచి సరస పాఠములెత్తి, వలసినవానికి లఘువ్యాఖ్యలు వ్రాయుచు దెలుగు విమర్శకుల కాదరణీయములగు భూమికలు వెలయించుచు, కవి జీవితములు ప్రమాణమాన్యములుగా బ్రకటించుచు నానందముద్రాలయము మూలమున దెలుగుబాసకు వాజ్మయపువిందు లిచ్చెను. చిన్నయసూరి వచనరచన నొరవడిగా నుంచుకొని, దానికంటె నొకమెట్టు దిగువనుండు సులభభాషలో సంపూర్ణముగా రామాయణ భాగవతములు హృద్యగద్యములో వ్రాసి వెలువరింప జేసెను. వచనభారతము కొన్నిపర్వములు మాత్రమైనవి. మన దేవరాజసుధి వాజ్మయసేవా సౌధమునకు ఆనందముద్రాలయమువా రాధార స్తంభాయమానులు.

ఈయన చివరిదశలో శ్రీసూర్యరాయాంధ్రనిఘంటు కార్యవ్యవహర్తగ బనిచేసి, తన్నిఘంటువునకు బహు గ్రంధపరిశీలనము గావించి పదపదార్థము లెత్తియిచ్చెను. పాండితిని మించిన వినయగరిమ కలవారీయన.

                   ------------------------