కొచ్చెర్లకోట రామచంద్ర వేంకట కృష్ణారావు
1871 - 1919
ఆరువేలనియోగి. దత్తతగొన్నతల్లి: కామాయమ్మ. తండ్రి: వేంకట జగన్నాథరావు. జన్మస్థానము: గోదావరీ మండలములోని పోలవరము. జననము: 1871 నవంబరు 11 వ తేది. నిర్యాణము: 1919. గ్రంథములు: 1. రాజతరంగిణి (కల్హణుని కాశ్మీర దేశప్రభుల చరిత్రమునకు దెలుగు వచనము) 2. అపవాద తరంగిణి (షెడిడనుకవి రచించిన స్కూల్ ఆఫ్ స్కాండల్ అను నాంగ్ల నాటకమునకు వచన రూపాంధ్రీకరణము. (1901 ముద్రి.) 3. సాహసిక కథార్ణవము (రాజపుత్రస్థానములోని చక్కని కథలు) 4. ప్రభువిశ్వాసము (ఆంగ్ల రాజ్యారంభము నుండి నేటిదనుక మన దేశమునకు గలుగు నుపకారము లిందు వర్ణితములు) వీరు సరస్వతి యను మాసపత్రికను వెలువరించిరి.
తెలుగుదేశమునగల జమీందారులలో భాషాపాండితియుండి కవిత రచింప గలవారలసంఖ్య మిక్కిలి కొలది. ఆ కొలదిమందిలోను పోలవరము ప్రభువులు వేంకటకృష్ణారావుగారు పేరుగన్నవలతి. ఆంగ్లములో నీయన బి.ఏ. పట్టము నందెను. సంస్కృతాంధ్రములలో నీయన పట్టములులేని భద్రులు. పండితుడై, పండితపోషకుడై, కవియై కవిపాలకుడై, రాజకీయవేత్తయై, ఈ కవిప్రభుని జీవితము తెలుగురచయితల కెందఱకో వెలుగుచూపినది.
పోలవరమున కధిపతులైన జగన్నాథరావుగారు పాతికయేండ్ల వయస్సు మీఱకుండగనే కాలధర్మము నందిరి. ఆయనధర్మపత్ని కామాయమ్మగారు తమ చెల్లెలికుమారుడగు మన వేంకట కృష్ణారావుగారిని దత్తపుత్త్రునిగ స్వీకరించి యైదవయేట నుండియే పెంచి పెద్దవానిని జేసి చదువుచెప్పించి పోలవరము జమీకి బ్రభువును జేసినది.