ఈ పుట ఆమోదించబడ్డది

కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు

1877 - 1923

లింగధారినియోగి. తండ్రి: వెంకటప్పయ్య. జననస్థానము: పెనుగంచిప్రోలు (కృష్ణామండలము). జననము: 1877 సం|| నిర్యాణము: 12-7-1923 సం|| విరచితకృతులు: ఆంధ్రవిజ్ఞాన సర్వస్వము (2 సంపుటలు వీరి సంపాదకత్వమున వెలువడినవి). శివాజీ చరిత్ర, హిందూదేశ కథాసంగ్రహము, మహారాష్ట్ర విజృంభణము, లక్షణరాయ వ్యాసావళి, హిందూ మహమ్మదీయ యుగములు.

లక్ష్మణరావుగారు సిద్ధహస్తులైన యాంధ్రరచయితలు. వీరు భాషాసేవకులలో బ్రథమశ్రేణిని లెక్కింపదగినవారు. 'విజ్ఞానచంద్రిక' యాంధ్ర గ్రంథమాలలలో నెంత ప్రతిష్ట గడించినదో లక్ష్మణరావుగా రాంధ్రచరిత్రోద్ధారకులలో నంతకీర్తి సంపాదించిరి. విజ్ఞానచంద్రికకు లక్ష్మణరావుగారు జీవగఱ్ఱ. ఈ గ్రంథమాలలో నీపరిశోధకునిచేయి సోకని గ్రంథము లేదు. కలకత్తా యం.ఏ.పరీక్షలో నుత్తీర్ణులైననాటి నుండియు వీరి హృదయక్షేత్రమున వాజ్మయసేవాంకురములు రేకెత్తుచు వచ్చినవి అవియే 'విజ్ఞానచంద్రిక' కు శుక్లపక్షములైనవి. ఈగ్రంథమాలలో పదార్థవిజ్ఞాన-పారిశ్రామిక-ప్రకృతి-భౌతిక-రసాయన-వృక్ష-జీవ-వైద్యశాస్త్రములకు సంబంధించినగ్రంథము లెన్నియో వెలువడినవి. ఈగ్రంథమాలలో గావ్యనాటకములకు జోటులేదు. దేశోద్ధారకులగు మహాపురుషులజీవితచరిత్రము లిందు బెక్కు ప్రకటితములు. ఆయావిషయములలో బ్రత్యేకప్రవీణులైన చిలుకూరి వీరభద్రరావు-కట్టమంచి రామలింగారెడ్డి- గురుజాడఅప్పారావు- ఆచంట లక్ష్మీపతి-అయ్యదేవర కాళేశ్వరరావు- గోటేటి జోగిరాజుపంతులు మున్నగు వారెందఱొ దీనికి గ్రంథములు వ్రాసి యొసగిరి. 'విజ్ఞానచంద్రిక'