ఈ పుట ఆమోదించబడ్డది

వర్ధమానులగు యువకవుల నాదరించి వారి నేదో విధముగ నభివృద్ధిలోనికి దీసికొనిరాగోరు దయాహృదయులువీరు. వీరిమనసు కడుమెత్తన. సజ్జనశబ్దమునకు లక్ష్మీనరసింహముగారు సరిపడిన యుదాహరణము. "మృదుళం నవనీతమీరితం నవనీతాదపి సజ్జసన్య హృత్,"


పేదవారల కెందఱకో వీరు చదువులు చెప్పించిరి. నిరుద్యోగుల నెందఱనో వాక్సాహాయ్యముచే నుద్యోగుల నొనరించిరి. వీరు కేవల కవులే కాక వీరేశలింగముగారివలె సంస్కరణాభిషులు; దేశసేవకులు. దేశమాత, మనోరమ మొదలగు పత్రికలు ప్రచురించి దేశభాషాసేవ గావించిరి. వీరేశలింగము పంతులుగారి సంస్కరణోద్యమ మందును, వారి భాషాసేవ యందును వీరి కనుపమానమగుభక్తి. సర్వవిధముల వారి యుద్యమములను క్షుణ్ణముచేసినవారు వీరే. కందుకూరివారు ఖడ్గవాదులు. చిలకమర్తి వారు కార్యవాదులు. ఇది యీ యిర్వురకును గలతారతమ్యము. 'లక్ష్మీనరసింహముగారిది యీమతము' అని చెప్పుట కష్టము. ఆయన సంస్కారవాదులగు వీరేశలింగకవిగారికి గుడిభుజముగ బనిచేసిరి. పీఠికాపుర ప్రభువులతో జెలిమి వాటించిరి. దేశనాయకుడు టంగుటూరి ప్రకాశముపంతులుగారిని గౌరవించిరి. 'అన్యుల మనమున్ నొప్పింపక తా నొవ్వక తప్పించుక తిరుగువాడు' కాన లక్ష్మీనరసింహకవిగారి నేవిషయమునను నాక్షేపించువారు లేరు.


చిలకమర్తికవి యార్జనము లక్షకు దాటినది. గ్రంథముల వలన నింతసంపాదనము చేసినవారు తెలుగువారిలో దక్కవ.


మఱియొకవిషయము 1907 లో వంగదేశమునుండి 'విపినచంద్రపాలు' అనునాతడు వచ్చి 'గోదావరీమండలమహాసభ'లో నుపన్యసించుచుండెను. ఉపన్యాససందర్భమున అశువుగ లక్ష్మీనరసింహముగా రీపద్యము చదివిరి.

భరతఖండంబు చక్కనిపాడియావు

హిందువులు లేగదూడలై యేడ్చుచుండ

తెల్లవారను గడుసరిగొల్లవారు

పితుకుతున్నారు మూతులు బిగియగట్టి.