గర్వితమతి వారు గావించుదౌష్ట్యంబు
నొప్పరికించుట యొక్కతప్పు
ఒప్పులే మేము చేయుట యొక్కతప్పు
తప్పు చేయక యుంటయే గొప్పతప్పు
అన్నితప్పులు మాయందే యున్న వబల!
తలచి చూడ బార్థునియందు దప్పుగలదె?"
అనెను. ద్రాక్షాపాకముతో, సుప్రసన్నశైలితో, సుమధురముగా నాటకపద్యములు నడపించుటలో లక్ష్మీనరసింహముగారిది గొప్పశక్తి. గయోపాఖ్యానమున కృష్ణార్జునుల క్రోధసంభాషణము చదువదగినది. 'సీ. నీచముచ్చము నాక రాచపాడి దొఱంగి బిడియ మించుక లేక బిచ్చమెత్త...మీసహోదరులకు సాటి మీరె సుమ్ము.' అని కృష్ణు డధిక్షేపించెను. 'సీ. అల్లుడారమ్మని యాదరమ్మున బిల్వబంపు మామనుబట్టి చంపగలమె ?' ఇత్యాదిగా నర్జును డాక్షేపించెను. ధీరోదాత్తులగు కృష్ణార్జునుల సంభాషణము హద్దుమీఱియున్నను గయోపాఖ్యానము సముచితవర్ణనాకరమై మనోహరముగ నున్నది. కనుకనే తెలుగున నీనాటక మింత ప్రశస్తి కెక్కినది.
లక్ష్మీనరసింహకవిగారు నాటకరచనలో నెట్టిదిట్టలో నవలారచనలో నంతకంటె నధికులు. వీరు కందుకూరి వీరేశలింగకవివలె నాంగ్లేయ గ్రంథానుసారముగ గాక చాల భాగము స్వతంత్రముగా నవలలు రచించిరి. వీరి చరిత్రాత్మకకథలలో కర్పూరమంజిరి, కల్పితకథలలో గణపతియు నుత్తమస్థానము నలంకరింపదగిన రచనలు. కథనచాతుర్యము, కథాసృష్టి, రసపుష్టి గల గద్యరచనమున వీరు సిద్ధహస్తులు. లక్ష్మీనరసింహకవి హాస్యరసాదరము కలవాడు. వీరేశలింగముగారి హాస్యరచనయు, పానుగంటికవి హాస్యరచనయు కొంచెము మోటుమార్గమున