కూచి నరసింహము
1866 - 1940
తల్లి: పుల్లమాంబ. తండ్రి: వెంకనార్యుడు. జన్మస్థానము: కుంచెనపల్లి (కృష్ణాజిల్లా). నివాసము: పిఠాపురము. జనను 17-10-1866 సం. నిధనము 7-10-1940 సం. గ్రంథములు: రూపలత, వనవాసి, గౌరాంగ చరిత్ర (2 భా) తెలుగు క్లాసుతమాషా, ఆగ్నేయాశుగములు, గ్రాంథిక భాష గ్రామ్యభాష, రామకృష్ణ పరమహంస చరిత్ర, ఆత్మనివేదనము, నానావిషయక విరచితములు. వివేకానందస్వామి పారాణికోపన్యాస చతుష్కము, భ్రమప్రమాద ప్రహసనౌ, ఆదర్శ సుఖజీవనము - ఇత్యాదులు.
రాత్రి పదిగంటలవేళ సాలువ గప్పికొని చేతికఱ్ఱ పుచ్చుకొని మెల్లమెల్లగ విద్యార్థులు చదువుకొను గదులకడకు వచ్చి యెవరు చదువు చుండిరో, ఎవరు చదువుటలేదో బారెడుదూరమున నుండి పరిశీలించి, మరునాడు పాఠశాలకు వచ్చినపుడు విద్యార్థుల నొక్కొక్కరిని పిలిచి "నాయనా! రాత్రి నీ వెన్ని పొగచుట్టలు తగులబెట్టితివి" అని చమత్కార గర్భముగ నడుగుచు, మొగమువాచునట్లు చీవాట్లు పెట్టు చుండువారట కూచి నరసింహము పంతులుగారు. ఉపాధ్యాయులలో నింత చండశాసను డుండడని వారి శిష్యులవలన వినికి. ఆయన యనపత్యుడు. శిష్యసంతానమే వారి సంతానము. విద్యార్థుల పురోభివృద్ధికి, వారి విజ్ఞానాభివృద్ధకి బంతులుగారనేక విధముల బరిశ్రమించెడి వారు. నయముననో భయముననో విద్యార్థుల నుద్ధరించుటయే ప్రధానాశయముగ బెట్టుకొనినారు. వీరు పెద్ద తరగతివారికంటె జిన్నతరగతివారికే యెక్కువశ్రద్ధ తీసుకొని పాఠము చెప్పుచుండువారు. పునాది దిట్టముగ నుండినగాని గోడ నిలబడ దని వీ రెఱుగుదురు. పిఠాపురోన్నత పాఠశాలను బ్రశంసించుచు 1907 లో జెన్నపుర పరీక్షా