ఈ పుట ఆమోదించబడ్డది

దు మ్మెరసుల్ కొఱంతలును దోచునటంచని కాదు వెండియుం

బన్నుట భారతేష్టతను బట్టి చాపల మంచు నెంచుడీ.


శ్రీకృష్ణమహాభారతము పేరు కవిత్రయభారతము వెనుక సుస్థిరముగా నుండుననుటకు సందేహములేదు. భారతము వ్రాయుట మాటలతో బనికాదు. భల్లూకపుబట్టు పట్టవలయును. ఏదేనొక మహోన్నత కార్యము తల పెట్టునపు డనేకాఘాతములు తగులుచుండును. అనేకాశయములు వెన్నాడు చుండును.


"ఆదరణీయసారవివిధార్థ గతిస్ఫురణముగా నౌచితీపోషణము చేసి కొనుచు గవినాథులగు నన్నయాదులు మున్నే మహాభారత మనువదించి యాంధ్ర కవితాలోకమున ననశ్వరయశస్సు నార్జించుకొని యుండిరి. వాగనుశాసనుడగు నన్నయభట్టారకు నంతవాడుకూడ భారతాంభోనిధిని తుదముట్ట నీదలేడయ్యె. ఒక వేళ, మనమీ గ్రంథము పూర్వసుకృత బలమున బూర్తి చేసినను గవిత్రయభారతమువలె రసికామోదము కలిగించునో, లేదో ?"


ఇత్యాది ప్రశ్నములే తద్గ్రంథరచనారంభమున బొడమి కవిమనస్సును గలచివై చుట సహజము. ఇదియన నేల ? ఏ మహోద్యమమందైన నిట్టి ప్రశ్నములేపుట్టి వ్యగ్రోత్సాహమును గొంత భగ్న మొనర్చు చుండుట తఱచు. ఇట్టిస్థితిలో నీసంశయములు వేనికిని దావీయక ధైర్యస్థైర్యములతో నక్షయదీక్షతో మహాభారత మంతయు బదునై దేండ్లలో సమగ్రముగా ననువదించి చరితార్థులైన కృష్ణమూర్తి శాస్త్రిగారు వజ్రసంకల్పులు, అరణ్యపర్వ రచనా కాలములో నీకవిరాజున కెన్నియో యిడుమలు గలిగినవి. ద్రోణపర్వము వ్రాయుచున్నపు డిక్కవికి స్మరణీయమగు నొక విషాదఘట్టము.