ఈ పుట ఆమోదించబడ్డది

బ్రవేశించి క్రమముగా నాంధ్రపండితపదవికూడ నలంకరించి వందలకొలది విద్యార్థులను బండితులనుగా జేసి యించుమించు నలువది వత్సరములుద్యోగధర్మము నిర్వహించిన యాచార్యశేఖరులు.


ఈయన విజయనగర సంస్కృతకళాశాలలో గావ్యనాటకాదులు చదివెను. తరువాత నాంగ్లకళాశాలలో బ్రవేశించి 1884 లో 'మెట్రిక్యులేషన్‌' లో దేఱెను. పిమ్మట దండ్రిగారు మరణించుటచే జదువు కట్టిపెట్టి యుద్యోగము చేయవలసివచ్చెను. కొన్నాళ్లు భాండాగారికుడుగా బనిచేసి క్రమముగా గళాశాలాపండితు డయ్యెను. ఈలోపున నిరంతరసాహిత్య కృషిమాత్రము మానలేదు.


వీరు సామాన్యసంస్కృత కావ్యనాటక సాహిత్యమే గాక సంఖ్యాది శాస్త్రజ్ఞానము, ఉత్తమసాహిత్యపాండిత్యము విజయనగరసంస్థానాస్థానవిద్వాంసులై మహాప్రఖ్యాతి నందిన ముడుంబై వేంకటరామ నృసింహాచార్యస్వామివారి సన్నిధినినేర్చిరి. మనపండితాచార్యులు ప్రస్థానత్రయము. నిరంతరము పఠించుచు వ్యాసంగముచేయు నలవాటు కలవారు. స్వీయమతమున నభినివేశము కలవారైనను బరమతములను దూలనాడు వారు కారు. వీరి భగవద్భక్తి చాల గొప్పది. ప్రాచీనాచారములు వీసమైనను వ్యతిక్రమించుట కీయన యిచ్చగింపరు. విశిష్టాద్వైతద్రావిడ వేదాంతగ్రంథములు వీరు చక్కగా జదివిరి. అందు వీరి గురువులు మహామహోపాధ్యాయ పరవస్తు వేంకటరంగాచార్యులవారు. శ్రీ పురాణము సూర్యనారాయణతీర్థులు మున్నగు విద్వత్కవు లెందఱో వేంకట రమణాచార్యులవారి యంతేవాసులు. శ్రీమాన్ ఈయూణ్ణి వేంకట వీర రాఘవాచార్యులుగారికి వీరు గురుపాదులు. ఎంతశక్తికలవారైనను నీయనవినయవాదము, గురుభక్తి గొప్పవి. ఇదిచూడుండు:


ప్రతిభ లేదు పెద్దపాండిత్యమును లేదు

శబ్దశాస్త్రవిథులజాడ నెఱుగ

శ్రీ ముడుంబ నారసింహుని కృపయె నా

కన్ని గూర్చి కృతికి వన్నె దెచ్చు. [ దేవవ్రతచరిత్ర ]

                         _________________