ములు వెలిబుచ్చిరి. ఆశాసనములలో 400 శాసనము లాంధ్రవిశ్వవిద్యా పీఠమునకు బ్రచురణార్థమొసగిరి. 'ఇండియా గవర్న మెంటు ' వారు శ్రీపంతులుగారి శాసనపరిశీలన ప్రతిభ నెఱిగి యాంధ్రదేశమునకు సంబంధించిన 800 శాసనములు పరిష్కరించుటకు వీరి కొసగి యుండిరి. వాని నన్నిటిని సంశోధించి పీఠికలు, లఘువ్యాఖ్యలు వ్రాసి పంతులుగారు ప్రభుత్వమునకు బంపిరి. అవి ముద్రితములగుట యాంధ్రులకుపకారము. వీరు పరిశోధనము గావించిన శాసనములలో 'తొత్తరమూడిశాసనము' తొట్టతొలిది. "యద్ధమల్లుని బెజవాడ శాసనము" ముఖ్యము. ఈశాసనపఠనమున వీరగపఱిచిన ప్రతిభోన్నతికి ప్రభుత్వము ప్రశంసించినది.
రామయ్యపంతులుగారు భాషాపోషకులుగాను, పరిశోధనపండితులుగాను గీర్తింపబడవలసినవారే కాని కవులుగా బేర్కొనదగినవారు కారని కొందఱయుద్దేశము. కాని వీరు రచించిన పద్యకావ్యములును లేకపోలేదు. 'అమరుకము' ననువదించిరి. ఈ యుదాత్తకృతికన్యకను యతిలోకసుందరాకారున కర్పించి ధన్యులైరి. "తెలుగుననె పుట్టె నీకృతి తొలుత ననెడి భావమాత్మ దోచెడుభంగి జెలగి" నీశృంగార కావ్యమనువదించిరి. అమరుకమునకుగల యాంధ్రానువాదములలో మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారి తరువాత వీరిదే సరసముగ నున్నది. ఈపద్యము లెంత హృద్యమగు శైలిలో నడచినవో చూడుడు.
అలకంబుల్ చెదరంగ గుండలయుగం బల్లాడ లే జెమ్మటం
దిలకంబించుకజాఱ గన్ను గవయెంతే దాంతమై యొప్పగా
జలజాతాంబక కేళి సల్పెడు సరోజాతాక్షి నెమ్మోము ని
చ్చలుమిమ్ముంగృప బ్రోచెడున్ హరిహరస్రష్టాదులిం కేటికిన్
పొగరుంగుబ్బలు పొట్టివై పులకలం బూనంగ నే నెంతయున్
బిగికౌగింటను గూర్ప జీర నడుము న్వేవీడి జాఱంగ దా
ళగ లేనింకను మానుమానుమని బల్ దైన్యంబుగా బల్కునీ
చిగురుంబోడికిమూర్ఛయో నిదురొకో చిత్తమ్మునం జేరెనో ?