ఈ పుట ఆమోదించబడ్డది

'వ్యాసమూర్తి శాస్త్రిగారి కవిత్వము స్వయంపాకమువలె శుచిగా నుండునేగాని ద్రాక్షాపాకమువలె రుచిగానుండ' దని యొకవాడుక. ఈ వాడుకకు వారు మహాపండితులగుటయే కారణము. శాస్త్రులుగారు రాజమహేంద్రవర పురవీథిని నడచుచుండునపుడు ప్రక్కప్రక్కల బోవు పండితులు 'అదిగో విజ్ఞానసర్వస్వము' అని చెప్పుకొనుచుండెడివారు. ఆ మహాశయునకు జోహారులనందుకొనుటయే సర్వకళాశాలలోని యుపాధ్యాయత్వమునకు మించిన పెద్దయుద్యోగ మైపోయినది. ఆ దివ్యతేజస్వి సారస్వతపీఠమున గూరుచుండి సాహిత్యగోష్ఠి సలుపునపుడు సరస్వతి పుంభావమును బడసినటులు కనులపండు నయ్యెడిది. ఆయన మహామహోపాధ్యాయులు కారు. కళాప్రపూర్ణులునుగారు. ఈ మహా బిరుదములను దాటి యన్వర్థనాముడైన పండిత మూర్ధరత్న మాయన. సంస్కృతాంధ్రములలో నఖండమైన పాండిత్యము. కవితారచనలో నసమానమైవేగము. భాష్యత్రయమునకు బాఠములు సెప్పినారు. ఆఱుశాస్త్రములలో దగిన పరిచయము. వారినాట సంస్కృతాంధ్రములలో నెవరి కే సందేహమువచ్చినను వీరు తీర్చు చుండెడివారు. ప్రమాణములు కావలసినను బ్రయోగములు కావలసినను నిఘంటువులు తిరుగవేయనక్కఱలేదు ఆయనదర్శనమునకు బోయిన జాలును.

వ్యాసమూర్తి శాస్త్రిగారి కనర్ఘ రాఘవ మభిమానగ్రంథము. దాని నాంధ్ర్రీకరించిరికూడను. వ్యానేశ్వరు డిష్టదైవము. తమకృతులన్నియు గేశనకుర్తి వ్యానేశ్వరునకే యంకితములు. ఈ యాంధ్రవ్యాసు డొక తుంగచాపపై నొక యుత్తరీయమును బఱుచుకొని యొకవంకసంస్కృత మహాభారతమును జూచుకొనుచు సులోచనములజోడు జారిపోవు చుండగా నిట్టె సవరించుకొనుచు 'మహాభారతనవనీత' రచనా నిమగ్నుడై యున్నపుడు-ఆమహాశయుని దివ్యదృశ్యమును గనులారగాంచు భాగ్య మాంధ్రులకింక దురాసము. ఒకతుడుపుగాని యొక సవరింపుగాని