ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పద్యమున బాండితీప్రతిభ, కవితామాధురి యొకదాని నొకటి మించి పొరపొచ్చములు లేక పొలుపొందినది. వీ రనువదించిన మేఘసందేశములోని యొక్క పద్యము పొందుపరుతును.


తమ్ముడ మేఘుడా ! తిథుల దద్దయు నెన్నుచు సాధ్విమన్నెడుం
జుమ్మి నిజంబుగా వదినె జుచెదుపో గమనంబు సార్థమౌ
నెమ్మిని నిండి పువ్వుసరణిన్ విరహంబున దీగబోండ్ల జీ
వ మ్మపుడూడ జూడ సుమబంధము వైఖరి నాన నిల్పుగా.


ఈ మహోపాధ్యాయులు ప్రతిదినము స్నాన సంధ్యాద్యనుష్ఠానము గావించి పార్థివలింగపూజ, లలితామంత్రజపము చేయుచుండెడివారు. ఈ లలితానుతి కనుగొనుడు.


లలితాం కలితాం కదంబపుష్పై
ర్మిలితాం సాంబశివేన మాతరం
లలితాంబరధారిణీం లతాంగీం
ఫలితాం తాం రనవాచ మర్థయే.


తిక్కన సోమయాజికి గురునాథుడు లేఖకు డైనట్లు మన వేంకటరామ శాస్త్రిగారికి సుంకర రంగయ్యగారు లేఖకుడై గ్రంథరచనోత్సాహము కలిగించెనట. రంగయ్యగారు వీరికి బ్రియశిష్యులు. ' గుప్తార్థప్రకాశిక ' రంగయ్యగారి కర్తృత్వముద్రతో మొదట వెలువరింపబడినది. శాస్త్రిగారి ప్రియశిష్యుడగుటచే వారి గ్రంథము సంగ్రహించె నని వదంతి కాని రంగయ్యగారు పీఠికలో ' సంస్కృతవ్యాకరణవిషయ మున్నచోట గురువులు వేంకటరామశాస్త్రిగారు పూరించి పరిష్కరించి ' రని వ్రాసికొనిరి. ఇట్టి గ్రంథచౌర్యము తొల్లిటినుండియు జరుగుచునే యున్నది. నేడు క్రొత్తగాదు.

వైయాకరణ శిరోభూషణులు, వ్యాఖ్యాతృశిఖామణులునగు వేంకట రామశాస్త్రిపాదుల కీర్తి జ్యోతిని శాశ్వతస్థితిలో బ్రకాశింపజేయునది బాలవ్యాకరణగుప్తార్థ ప్రకాశిక యొక్కటే.