ఈ పుట ఆమోదించబడ్డది

కల్లూరి వేంకట రామశాస్త్రి

1857-1928

తల్లి: కామసోమదేవి. తండ్రి: వేంకటశాస్త్రులు. అభిజనము: గోదావరీ మండలములోని ముగ్గుళ్ల. నివాసము: రాజమహేంద్రవరము. పుట్టుక: 16-9-1857. కడకాలము: 29-5-1928. కృతులు: 1. వంశముక్తావళి (ఆధ్యాత్మిక పద్యకృతి), 2. కోటిలింగేశ్వర శతకము, 3. హాస్య కుముదాకరము (ప్రహసనము), 4. బాలవ్యాకరణ గుప్తార్థ ప్రకాశిక, 5. మేఘసందేశము (ఆంధ్రపరివర్తనము).

కల్లూరి వేంకటరామశాస్త్రిగారి కీర్తివల్లరికి గుప్తార్థప్రకాశిక యువఘ్నము. బాలవ్యాకరణముపై వెలువడిన వ్యాఖ్యలలో నిది తొట్టతొలిది. వేంకటరామశాస్త్రిగారి సంస్కృత వ్యాకరణాభిజ్ఞత నిర్వేలము. ఈ విషయమునకు గుప్తార్థప్రకాశిక ప్రత్యక్షరము సాక్ష్యమిచ్చును. వీరియభిప్రాయములలో గొన్ని పొరపాటు లున్న వని విమర్శకు లెత్తిచూపిరి. అట్టివారిలో మహామహోపాధ్యాయ తాతా సుబ్బారాయశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రిగారలు ప్రముఖులు. ప్రతివాదుల విమర్శనములను మన శాస్త్రిగారు మహోపాధ్యాయులుగాన జాలభాగము ప్రతిఘటించిరి. ఎవ రేమన్నను గుప్తార్థప్రకాశిక గొప్ప వ్యాఖ్య. "బ్రహ్మశ్రీ శిష్టు కృష్ణమూర్తిశాస్త్రి పండితవర్య ప్రణీత హరికారికాంధ్రీభూత పరవస్తు చిన్నయసూరి కర్తృక బాలవ్యాకరణము" నకు వ్యాఖ్యానమని ముఖపత్త్రముపై వ్రాసికొనిగాని వేంకటరామశాస్త్రిగారు తృప్తి పడలేదు. బాలవ్యాకరణము చిన్నయోవజ్ఞము కాదనియు, శిష్టు కృష్ణమూర్తిశాస్త్రిగారి హరికారికల కనువాదప్రాయ మనియు వీరి యాశయము. దీనిని పెక్కుమంది పండితులు సోవపత్తికముగా 'గాదు కా' దని ప్రతిఘటించిరి. పట్టినపట్టు వదలక పాండిత్య విశేషముచే స్వమత ప్రతిష్ఠాపనమున కెన్నో యుక్తులు ప్రకటించిరి. కాని యీవిషయమున మాత్రము వేంకటరామశాస్త్రిగారి పక్షము నెగ్గినట్లు తలపజనదు.