ఈ పుట ఆమోదించబడ్డది

దాక వెలువరింపబడలేదు. తిక్కన సోమయాజి తెనుగులో గొన్ని వేదాంతఘట్టములు పరిత్యక్తములయి యుండుట సహింపక, జగద్ధితమునకై భగవద్గీత, ప్రజాగరపర్వము, సనత్సుజాతీయము తాడూరికవి యాంధ్రీకరించెనట. ఇవి పరికించి కొందఱు ప్రోత్సహింపగా ఉద్యోగపర్వము సమగ్రముగా ననువదించెను. భారతపర్వములలో ఉద్యోగము సారవంతమని, లోకప్రవృత్తికి ముఖ్యమని యెంచి తెనిగించిరని కవి హృదయమును వారి కుమారులు వెలువరించిరి. ఈతెనుగు నేత శ్లోకానుక్రమముగా నున్నది. .....లో ప్రథమపుత్రశోకము వలన విరక్తుడై యీకవి భగవద్గీతాదికృతులు తెనుగు సేసెనట. విదురనీతిలోని పద్యములు:

అవమానింపక యెట్టిదుర్బలుని చిద్రాన్వేషియై నేర్పుతో

నవనీనాయక బుద్ధిపూర్వముగ నొయ్యన్ వైరినిం గొల్చుచున్

భువిలో జాల బలిష్టులౌ పగఱతో బోరాడ నావిక్రమం

బవురా! మేల్తఱివేచి తానెఱవు నేడాతండు ధీరుండునూ

ఆపదవచ్చినప్పు డినుమంతయునొవ్వక జాగరూకుడై

యోవుచు శోభనార్థమయి యొప్పు బ్రయత్నము లాచరించుచున్

సైవుచు నడ్మ గష్టమయిన న్వెలుగొందెడు నమ్మహాత్ముడో

భూప! ధురంధరుండు రివువుంజము నాతడు గెల్చినాతడే.

ఇక, ఋతుసంహారము నందలి శృంగారపద్యశైలి తీరు నారయునది.

ఒండొక పువ్వుబోడి నురతాగ్రతచే నొడలెల్ల డస్సి తా

మెండుగ రాత్రియెల్ల రతి మేల్కొనుట న్నయనంబు లెఱ్ఱనై

మండగ గొప్పువీడి భుజమండలి దాండవ మాడుచుండ నీ

రెండ ప్రభాతవేళ మెయికింపుగ దాకగ నిద్రవోయెడిన్.

ఈ లక్ష్మినరసింహరాయకవి కవిత యాత్మానందము నుద్దేశించి వ్రాయబడిన దగుటచే దెలుగు ప్రజలు హెచ్చుగా జూడలేదు. ఈయన ధోరణిలో వ్యుత్పత్తికంటె బ్రతిభాభ్యాసముల సాలు మిక్కిలిగా నుండును. అందచందములకంటె నావేశము హెచ్చు.

                         _______________