ఈ పుట ఆమోదించబడ్డది

శొంఠి భద్రాద్రి రామశాస్త్రి

1856-1915

జననము: 1856. నిధనము: 1915. జన్మస్థానము: పిఠాపురము సమీపముననున్న కొమరగిరి. వెలనాటి వైదికులు. గౌతమగోత్రీయులు. తండ్రి: గంగరామయ్య. తల్లి: కామాంబ. రామచంద్రోపాఖ్యాన ప్రబంధకర్త వారణాసి వేంకటేశ్వరకవి యీయనకు మాతామహుడు. వంశీయులెల్లరు వేదవిదులు. కవికర్తృక గ్రంథములు: కాళిందీ పరిణయము, శంతనూపాఖ్యానము (ఆంధ్రప్రబంధములు). చిత్రసీమ (కళాపూర్ణోదయమువంటి కల్పితకథా కావ్యము). శంబరాసుర విజయము (సంస్కృత చంపువు). శివరామశతకము (ద్వ్యర్థి. ఆముద్రితము) ముక్తావళి (మదాలస కథగల సంస్కృతాంధ్ర నాటకములు-) మల్లిక (నవల-అముద్రితము) అహోబల పండితీయ వ్యాఖ్య- లఘుకౌముది (ఆంధ్ర టీక) జగన్నాథక్షేత్ర మహాత్మ్యము, శ్రావణ మహోత్సవ తారావళి - ఇత్యాదులు.

తిరుపతివేంకటకవులు 'భద్రాద్రిరామకరుణ యున్నచో మాకు లోపముండ'దని యొక నమస్కారబాణము విసిరికాని పిఠాపురములో నవధానమునారంభింపలేదు. సిద్ధాంతకౌముదికి బాఠము వ్యాఖ్యానవిశేషముల గ్రోడీకరించి చెప్పువారిలో నాడు భద్రాద్రిరామశాస్త్రిగారు ప్రోడలు. "కౌముది యది కంఠస్థా వృథా భాష్యే పరిశ్రమ:" అనుసూక్తి వీరిపట్ల సముచితముగ సమన్వయించును. ఈయన వినయసంపద పాండిత్యమును మించినది. కర్మాచరణము కవితాపాటనమును డాటినది. బ్రాహ్మముహూర్తమున లేచి సచ్చాత్రుడై పిఠాపురములో బాద గయాక్షేత్రమునకు బోయి స్నానసంధ్యాదులు కావించి, కుక్కుటేశ్వర దర్శనము చేసి వచ్చి యింట గూర్చుండి విద్యార్థులకు బాఠములు చెప్పుకొనుచు సూర్యాలోకము లేకుండ జీవయాత్ర సాగించినధన్యుడీయన. ఆలంకారగ్రంథము లాయన పెక్కుమందికి బాఠము చెప్పెను.