కోలాచలము శ్రీనివాసరావు
1854-1919
జన్మస్థానము: హంపీ విరూపాక్ష క్షేత్ర సమీపమున నున్న కమలాపురము. జననము: 13-3-1854 సం. నిర్యాణము: 20-6-1919 సం. గ్రంథములు: సునందినీ పరిణయము, మదాలసా పరినయము, శ్రీరామ జననము, పాదుకా పట్టాభిషేకము, లంకా దహనము, ద్రౌపదీ వస్త్రాపహరణము, కీచకవధ, బభ్రువాహన నాటకము, హరిశ్చంద్ర, రుక్మాంగద, చంద్రహాస, శిలాదిత్య, ప్రతాపాగ్బరీయము, కాళిదాదు, ప్రహ్లాద, రామరాజుచరిత్ర, మైసూరు రాజ్యము, చాందుబీబీ, కుశలవ (నాటకములు) హాస్యమంజూష, అగస్త్యబాలభారత శతకము, ఆంధ్రీకృతాగస్త్య భారతము - మొదలగునవి.
పేరుమోసిన నాటకరచయిత లిరువురు "బళ్ళారి" ని పావనము చేసిరి. అందు మొదటివారు ధర్మవరమువారు. రెండవవారు శ్రీనివాసరావుగారు. వీరిరువురును న్యాయవాదులు. ఇరువురును నటకులు, ధనికులును. కృష్ణమాచార్యులవారి చిత్రనళీయ మెంతపేరు సంపాదించినదో, శ్రీనివాసరావుగారి రామరాజుచరిత్ర మంత ప్రతిష్ఠ నార్జించినది. "రామరాజుచరిత్రము" చారిత్రకము. తల్లికోట యుద్ధమున గీర్తిశేషుడైన యళియ రామరాజుకథ యిం దభివర్ణితము. వీరి మైసూరు రాజ్యము, ప్రతాపాక్బరీయము చారిత్రకములు.
వీరు గ్రామ్యభాష నొప్పుకొనరు. కళాశాలలలో గ్రామ్యము నుపయోగింపవచ్చు నన్నప్పుడు మదరాసు విశ్వవిద్యాలయము వారేర్పాటు చేసిన సంఘమునకు శ్రీనివాసరావుగారు సభాపతులై వ్యావహారికమును నిరసించివైచిరి. సంఘసంస్కారమును గూడ వీరు కోరినటులు లేదు. నాటకములు విషాదాంతములు చేయుట వీరి కనిష్టము. ప్రాకృతాది భాషలకు బదులు వ్యావహారిక ముపయోగించ వచ్చునన్న వేదమువారి మతము సైతము వీరికి సమ్మతము కాదు. చారిత్రకములు, సంఘసాంబంధికములు నగు నాటకములే యీనాట వెలయవలెనని వీరు చెప్పినారు. తెలుగునకు శ్రీనివాసరావుగా రిచ్చిన సందేశమునకు సంగ్రహ మిది :