వడ్డాది సుబ్బారాయకవి
1854-1938
నియోగి బ్రాహ్మణులు. హరితసగోత్రులు. తండ్రి: సురపరాజు. తల్లి: లచ్చాంబ. జన్మస్థానము: నగరము తాలూకాలోని పాసెర్లపూడి. నివాసము: రాజమహేంద్రవరము. జననము: 30-7-1854 సం- (ఆనంద నామ సం. శ్రావణ శుద్ధ పంచము ఆదివారము). నిధనము: 2-3-1938. కృతులు: ప్రబోధ చంద్రోదయము, ఆంధ్రవేణిసంహారము, అభిజ్ఞాన శాకుంతలము, మల్లికా మారుతము, విక్రమోర్వశీయము, చండకౌశిక నాతకము, నృసింహ విశ్వరూపము, గౌతమీ జల మహిమాను వర్ణనము, భక్త చింతామణి, ఆర్తరక్షామని, మేఘ సందేశము, నందనందన శతకము, సతీస్మృతి, సుతస్మృతి, వసురాయచాటూక్తిముక్తావళి, శ్రీసూక్తివసుప్రకాశిక, సుగుణ ప్రదర్శనము - ఇత్యాదులు.
ఉపాధ్యాయత్వమున గవిత్వమున సుబ్బారాయుడుగారు చాలసమర్థులు. రాజమహేంద్రవరమునందలి సర్వకళాశాల వీరి యధ్యాపకత్వమున కాశ్చర్యపోయెడిది. ఓ.జె.కూల్డ్రెదొరయంతవాడు వ.సు.రాయకవిగారి పాఠము వినుటకు జెవికోసికొని తలుపుచాటున నక్కువాడనిప్రతీతి. అందులో నాయన భారతపాఠము మఱియు నద్భుతము. వినితీరవలె నని నాటి విద్యార్థులిప్పటికి జెప్పుకొనుచుందురు.
మదరాసు గవర్నరైన సర్.కె.వి.రెడ్డినాయుడు వీరికి దెలుగున శిష్యుడు. విదేశీయుడు "హ్యామ్నెటు" దొర సుబ్బారాయుడు గారియొద్ద జాలకాల మాంధ్రభాష నభ్యసించెను. వీరికడ విద్యాభ్యాసము చేసి పైకివచ్చినవారు పెక్కండ్రు. ఎంతవారైన వీరియెడ నమ్రులై యుండవలసినదే. ఆయన యితరులకు లొంగలేదు. విధ్యార్థులకు లోకువకాలేదు. ఆత్మగౌరవము కాపాడుకొనుచు దా మేస్థానమున నుండవలయునో, యాస్థానమున నుండుట వారి సహజగుణము. మాట