ఈ పుట ఆమోదించబడ్డది

పురాణపండ మల్లయ్యశాస్త్రి

1853-1925

ఆరామద్రావిడశాఖీయ బ్రాహ్మణుడు. తండ్రి: భద్రయ్యశాస్త్రి. తల్లి: రామమ్మ. జన్మస్థానము: పెదతాడేపల్లి. నివాసము: ఖండావల్లి, పిఠాపురము, రాజమహేంద్రవరము. జననము: 1853 సం. అస్తమయము: 1925 సం. గ్రంథములు: ఆంధ్రీకృతబ్రహ్మసూత్ర భాష్యము (4 సంపుటములు) ఉపనిషత్కథలు, శుక్రనీతిసారము, ప్రభావతీ ప్రద్యుమ్న, భద్రా పరిణయములకు వ్యాఖ్యలు - ఇత్యాదులు.

మల్లయ్యశాస్త్రిగారు సంస్కృతాంధ్రములలో మహాపండితులు. వీరు ప్రఖ్యాతప్రాజ్ఞఉలైన వెంపరాల దక్షిణామూర్తి శాస్త్రిగారి సన్నిధిని సూత్రభాష్యము నియమపూర్వకముగ నధ్యయనించిరి. తర్క వ్యాకరణములు పఠించిరి. ప్రస్థానత్రయతత్త్వ మెరింగిరి. ఇట్టి విద్యాధికార సంపత్తి కలిగిన మీదట మల్లయ్యశాస్త్రిగారు పీఠికాపురాధిపతుల యాజ్ఞచే శాంకరసూత్ర భాష్యమును దేటతెల్లముగ దెలుగున వ్రాసిరి. సూత్ర భాష్యమునకు మరికొందరుకూడ తెలుగు వ్రాసిరి. ఆ యనువాదములలో నీయదియే మేలైనది. బ్రహ్మసూత్ర భాష్యము ననువదించుటకు సామాన్య పరిజ్ఞానము చాలదు. సర్వశాస్త్ర ప్రవేశము, సర్వదర్శన పరిచయము నుండవలయును. అధీతిబోధాచరణ ప్రచారణము లున్నవారికిగాని యిట్టి యుద్గ్రంథముల తత్త్వము తెలియదు. సర్వధా సామర్ధ్యము కలిగి యాంధ్రవచనరచనలో గూడ నారితేరినవారగుటచే మల్లయ్యశాస్త్రిగారు ' ఆంధ్రసూత్రభాష్య ' మందు పాటులోనున్న శైలిలో రచింపగలిగిరి. విషయ గౌరవ ప్రాశస్త్యాదులం బట్టియు నాంధ్రభాషకు బుష్టికరమగుత బట్టియు నీగ్రంథము శాశ్వతముగ నాంధ్రమున నుండగలదు. రచనావిశేషమున కీపంక్తులు పరికింపుడు.

" శాస్త్రయోనిత్వాత్ " - ఋగ్వేదాది శాస్త్రమునకుం గర్త యగుటవలన (బ్రహ్మము సర్వజ్ఞము) బ్రహ్మస్వరూప జ్ఞానమునందు ఋగ్వేదాదిశాస్త్రమే ప్రమాణమగుట వలన దానిచేతనే జగజ్జన్మాది కారణమగు బ్రహ్మము తెలియంబడునేని అని యర్ధము. " భా. గొప్పది