ఈ పుట ఆమోదించబడ్డది

ప్రకాశకుల విన్నపము

ఈగ్రంథము, మా సరస్వతీగ్రంథమండలికే గాదు, ఆంధ్ర వాజ్మయమునకును క్రొత్త భూషణము. శ్రీమధునాపంతుల సత్యనారాయణశాస్త్రిగారు, ఇది రచించుటతో, గ్రంథకర్తలలో తా మొక విశిష్టస్థాన మాక్రమించుకొని, ప్రకటించుటతో, గ్రంథప్రకాశకులలో మాకు నొక విశిష్టస్థాన మనుగ్రహించినారు.

ఆంధ్రవాజ్మయమున, నేడు, శ్రీ వీరేశలింగంపంతులుగారి కవుల చరిత్రతో సరితూగగల గ్రంథ మిది యొక్కటియే. అందు కవుల బాహిరరూపము చిత్రింపబడినది. ఇందు రచయితల ఆంతర రూపము చిత్రింపబడినది. అది సంతరించుటకు పంతులుగా రెంత శ్రమ పడియుండినారో, యిది సంతరించుటకు శ్రీ శాస్త్రిగారును అంత శ్రమపడినా రని పాఠకులు స్ఫుటముగా గుర్తింపగలరు.

ఇందు పందొమ్మిదవ శతాబ్ది రచయితలనే గ్రహించినారు. అయితే, విషయసేకరణకు అవకాశములు చాలక, మరికొందరి నిందు చేర్చుటకు వీలులేకపోయినది. ఆకొందరు, అధిక సంఖ్యాకులు గాని అల్ప సంఖ్యాకులు కారు. వారిని గురించి మరింత గ్రంథము తయారు కావలసియున్నది. అందుకును తమకు గల ఉద్దేశప్రయత్నములు శాస్త్రిగా రిందు ఉల్లేఖించియే యున్నారు. నేనును అదియును ప్రకటించుటకు ఉత్సుకుడనై యున్నాను. మే మిరువురమును గూడ ఇందు త్వరితముగనే కృతకృత్యులము కాగలమని నేను నమ్ముచున్నాను.

ఈగ్రంథము చదివిన, దిగ్గజమువంటి అనేకజీవద్రచయితల గోష్ఠిలో పాల్గొనుచున్నట్టు విలక్షణానుభూతి కలుగును. దానంజేసి