కందుకూరి వీరేశలింగకవి
1848 - 1919
ఆరువేల నియోగిబ్రాహ్మణుడు. జన్మస్థానము: రాజమహేంద్రవరము. తల్లి: పున్నమాంబ. తండ్రి: సుబ్బారాయడు. జననము: 16-4-1848. నిర్యాణము: 27-5-1919. విరచిత గ్రంథముల సంఖ్య 130-ప్రబోధచంద్రోదయము, మాలతీమధుకరము, మాళవికాగ్నిమిత్రము, అభిజ్ఞానశాకుంతలము, రత్నావళి, హరిశ్చంద్ర నాటకము, సత్యరాజ పూర్వదేశయాత్రలు, వినీసు వర్తకుని చరిత్ర, రాగమంజరి, రాజశేఖరచరిత్ర, నీతిచంద్రిక, ఆంధ్రకవుల చరిత్రము, స్వీయచరిత్రము, ప్రహసనములు మొత్తము 58. ఇత్యాదులు. విపులచరిత్రమునకు వీరి స్వీయచరిత్ర (2 భాగములు) చదువుకొనవలయును.
వీరేశలింగంగారు తెలుగు వాజ్మయమున దొల్లి త్రొక్కని క్రొత్తదారు లన్నియు ద్రొక్కి యాధుని కాంధ్రవాజ్మయమునకు మార్గదర్శి యనిపించుకొనినకవి. ఆయన రచించిన గ్రంధములు నూట యిరువదికి బైగా నున్నవి."అయిదవవాచకము" మొదలుకొని "ఆంద్ర కవుల చరిత్ర" వఱకు వ్రాసినారు. నవలలకు దారిచూపినారు నాటకములు రచించినారు. కథలల్లినారు. వ్యాసములు వెలువరించినారు. ప్రహసనములు ప్రకటించినారు. గ్రంధవిమర్శలు సంధానించినారు. శాస్త్రగ్రంధములు సంతరించినారు. చారిత్రక కృతులు ప్రచురించినారు. వార్తా పత్రికలు సంపాదించినారు. విశేష మేమనగా నీ సారస్వతశాఖలకు గొన్నిటికి ద్రోవచూపినవారు, కొన్నిటికి రాచబాట వేసినవారు నైరి.
పందొమ్మిదవశతాబ్ది శేషార్ధమునుండి తెలుగున నొక క్రొత్తయుగ మారంభమైనది. దానికి గద్యయుగ మని సాధారణపు బేరు పెట్టవచ్చును. అంతకు బూర్వము వచనగ్రంధములు మిక్కిలి తక్కువ. చంపూపద్ధతిని పురాణములలో నక్కడక్కడ వచన ముపయోగింపబడినది. ప్రబంధములలో వచనము ఛందోనిర్బంధము లేనిపద్యములవలె