ఈ పుట ఆమోదించబడ్డది

కాలమునుండియు వీరికి మహమ్మదీయులతో యుద్ధములు జరుగుచు వచ్చెను. 1364 వ సంవత్సరమునందు మొట్ట మొదట బుక్కరాజు మహమ్మదీయులను యుద్ధములో జయించెను. ఆతని పుత్రుడైన హరిహరరాజును మహమ్మదీయులతో యుద్ధము చేసి 1380 న సంవత్సరమునందు తురష్కులను గోవానగరమునుండి వెడల గొట్టెను. ఈ హరిహరరాజు హిందూదేవాలయముల కనేకములకు భూధానములు చేసెను. హరిహరరాజుయొక్క కడపటి దినములలో సాళువగుండరాజు మంత్రిగా నుండెను. గుండరాజు జైమినిభారతము కృతినందిన సాళువనృసింహరాజుతండ్రి. గుండరాజు మంత్రిగాను దండనాథుడుగాను ఉండి కొంత రాజ్యమును సంపాదించెను. తదనంతర మాతనిపుత్రుడు సాళువ నృసింహరాజు దేవరాయలు సంతానము లేక మృతుడగుటవలననో మఱియేలాగుననో కర్ణాటకరాజ్యము నాక్రమించుకొనెను. నరసింహరాజునకు తిమ్మరాజను పేరుగల జ్యేష్టభ్రాత యొకడు గలడు. అతడే యీశ్వరరాజు తండ్రియైన సాళువతిమ్మరాజని తోచుచున్నది. సాళువ నృసింహరాజు భూదానములు మొదలయిన దానము లనేకములు చేసెను. ఇతడు చిత్తూరి మండలములోని వందవాసినగరమునకు పడమట నామడదూరములో నున్న వెల్లము గ్రామములోని దేవాలయమునకు శాలివాహనశకము 1391 వ సంవత్సరమునం దనగా హూణశకము 1469 వ సంవత్సరమునందు గొంతభూమి యిచ్చెను; ఈతని రాజ్య కాలములోనే చిత్తూరిమండలములోని యాపూరు గ్రామములోని శివాలయమున కొకరిచేత శాలివాహనశకము 1393 వ సంవత్సరమునకు సరియైన క్రీస్తుశకము 1471 వ సంవత్సరము నందు గొంతభూమి యియ్యబడినది. ఈ నృసింహరాజు కాలమున తిమ్మరాజు పుత్రుడైన యీశ్వరరాజు దండనాథుడుగా నున్నట్లు వరాహపురాణ పీఠికవలన దెలియవచ్చుచున్నది. ఈ నృసింహరాజు మరణానంతర మీశ్వర రాజపుత్రు