ఈ పుట ఆమోదించబడ్డది

9. భాస్కర పంతులు

ఈకవి కన్యకాపురాణమనెడి యెనిమిదాశ్వాసముల పద్యకావ్యమును రచించెను. రాజరాజనరేంద్రుని తండ్రియైన విష్ణువర్ధనమహారాజు గోదావరీమండలములోని పెనుగొండలోనుండిన కుసుమసెట్టియను కోమటియొక్క కొమార్తెను కామించి యామెను తన కిమ్మని యడుగగా తండ్రి యియ్యనన్నట్టును, అందుమీద విష్ణువర్ధను డాకన్యను బలాత్కారముచేత గ్రహించుటకు బ్రయత్నింపగా కుసుమసెట్టియు కూతురును నూటరెండు గోత్రముల యితరవైశ్యులును నగ్నిహోత్రములో బడి మృతులయినట్టును, కోమట్లలో నూరుకుటుంబములు పడమటకు, ఎనుబది కుటుంబములు తూర్పునకును, ఇన్నూరు కుటుంబములు దక్షిణమునకును, నూటముప్పది కుటుంబము లుత్తరమునకును పారిపోయినట్టును, కన్యకాశాపముచేత విష్ణువర్ధనుడు శిరస్సు వ్రక్కలయి చావగా నాతనిపుత్రు డయిన రాజనరేంద్రుడు వైశ్యులను శాంతపరిచి కుసుమసెట్టి కొడుకైన విరూపాక్షుని పదునెనిమిది పట్టణముల కధికారినిజేసి మిగిలిన కోమట్లను పెనుగొండలో నుండునట్లు చేసినట్టును ఇందు జెప్పబడినది. ఇప్పటికిని పెనుగొండ కోమట్లకు ముఖ్య స్థలము. అక్కడ కన్యకాపరమేశ్వరిపేర దేవాలయము కట్టబడి వైశ్యులచే మిక్కిలి గౌరవముతో చూడబడుచున్నది. గ్రంథకర్తయైన భాస్కరపంతు లనుబ్రాహ్మణుడు పెనుగొండ, కొండవీడు, రాజమహేంద్రవరము మొదలయిన ప్రదేశములయందుండిన కోమట్లకు గురువయియుండి కన్యకాపురాణమును రచించి, వైశ్యులవిషయమయి కొన్ని కట్టుపాట్లనుజేసి, నూటరెండు గోత్రములవారి నా కట్టుబాట్లకు లోబఱిచి, తనయేర్పాటులను మీఱినవారిని వర్ణభ్రష్టులనుగా బహిష్కరించి తనకు వశ్యులయినవారికి దా నాచార్యుడును పురోహితుడును