ఈ పుట ఆమోదించబడ్డది

భద్రాతీరమునందున్న పంపానగరమునందు జన్మించిరి; వీరు బుక్కభూపాలునికి కులగురువులు; భారద్వాజసగోత్రులయిన తెలుగు బ్రాహ్మణులు; ఈయన తండ్రి మాయణుడు; అన్నసాయణుడు. అన్న యందును తండ్రియందునుగల గౌరవముచేత మాధవాచార్యుల వేదభాష్యములలో గొన్నిటికి వారిపేరులు పెట్టెను. మాధవాచార్యులు తొంబదిసంవత్సరముల ప్రాయమున సిద్ధిపొందిరట; ఈయన 1368 వ సంవత్సరము నందు బుక్కరాజుమంత్రి యైయుండిన ట్లొక తామ్రశాసనమువలన దెలియ వచ్చుచున్నది. మాధవీయాదిగ్రంథములలో మాధవాచార్యులవారు తమవంశమును దెలుపుచు వ్రాసిన రెండు శ్లోకముల నిందు జూపు చున్నాను:-

శ్లో|| యస్య బోధాయనంసూత్రం శాఖాయస్యచయాజుషీ

భారద్వాజకులంయస్య సర్వజ్ఞ స్సహిమా ధవ:

శ్రీమతీయస్యజననీ సుకీర్తి ర్మాయణు: పితా

సాయణోభోగ వాథశ్చ మనోబుద్ధిసహోదరౌ.

బుక్కరాజుతరువాత నాతనికి కామాక్షీ దేవివలన బుట్టినహరిహరనాథుడు 1379 వ సంవతరము మొదలుకొని 1401 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసెను. ఈ హరిహరరాజునకు మల్లాదేవి వలన గలిగిన పుత్రుడైన వీరప్రౌడదేవరాయలు 1412 వ సంవత్సరము వఱకును, ఆతనిపుత్రుడైన విజయభూపతి 1418 వ సంవత్సరము వఱకును, ఆతనికుమారుడైన దేవరాయలు 1422 వ సంవత్సరము మొదలుకొని 1447 వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినట్లు శిలాతామ్రశాసనములవలన దెలియవచ్చుచున్నది. కాని వీ రేయేసంవత్సరములయందు సింహాసన మెక్కిరో యేయేసంవత్సరములయందు పరమపదమును పొందిరో నిశ్చయముగా దెలియదు. బుక్కరాజు