ఈ పుట ఆమోదించబడ్డది

అని రెండవచరణమును పూరించి లోనికి జనియెననియు, తరువాత బట్టుమూర్తి


నీ కిదె పద్యము గొమ్మా

అనిపలికి లోపలి కరిగెననియు, కడపట వికటకవియైన రామకృష్ణుడు

నా కీపచ్చడమెచాలు నయమున నిమ్మా.


అని పద్యము పూర్తిచేయగా నతడు వెంటనే తనపచ్చడమును రామకృష్ణునిమీద వై చెననియు, రాజావార్తవిని యాతని సాహసౌదార్యములకు మెచ్చి గొప్ప బహుమానమిచ్చెననియు ఇంకొకకథను జెప్పుచున్నారు. ఇటువంటి కథలనేకము లున్నవి. ఒకనాడు రాయలవారాస్థానమున గొలువుండి తన పార్శ్వములనున్న తిమ్మన్నను పెద్దన్నను బట్టుమూర్తిని జూచి వరుసగా తామరాకులోని నీటిబొట్టును కుక్కుటమును వరాహమును దిరస్కరించుచు బద్యములను జెప్పుడని వేడగా వా రాశుకవిత్వముగా నీమూడు పద్యములను జెప్పిరట:-


ఉ. స్థానవిశేషమాత్రమున దామరపాకున నీటిబొట్ట నిన్

బూనిశ మౌక్తికంబనుచు బోల్చినమాత్రనె గర్వ మేటికిన్

మానవతీశిఖామణులమాలికలందును గూర్పవత్తువో

కానుక లియ్యవత్తువొ వికాసము దెత్తువొ మేలు దెత్తువో:- [ముక్కుతిమ్మన]


శా. రంతు ల్మానుము కుక్కుటాధమ దరిద్రక్షుద్రశూద్రాంగణ

ప్రాంతో లూఖలమూలతండులకణగ్రాసంబుచే గ్రొవ్వి దు

ర్దాంతాభీలవిశేషభీషణధణాంతర్మాంససంతోషిత

స్వాంతుండైన ఖగేంద్రుకట్టెదుట నీజంఝూటము ల్సాగునే- [పెద్దన్న]