ఈ పుట ఆమోదించబడ్డది

మించుగా బారిజాతాపహరణము మనుచరిత్రము రచియింపబడిన కాలమునందే రచియింపబడిన దగుటచేత హూణశకము 1520 వ సంవత్సరమునకు బూర్వముననే పారిజాతాపహరణము ముగింపబడినది. తదనంతరమీకవి కొన్ని సంవత్సరములుమాత్రము బ్రతికి కృష్ణదేవరాయడు జీవించియుండగానే మృతినొందెను. కాబట్టి యితడు దాదాపుగా 1526 వ సంవత్సరమువఱకును జీవించియుండెనని చెప్పవచ్చును. ఈకవియొక్క జన్మస్థలము గణపవరమని యొకరు వ్రాసియున్నారుగాని దానిసత్యమును నిర్థారణము చేయుటకు దగినయాధార మేదియు గానరాదు. మఱియు నీతనిని గృష్ణదేవరాయనిభార్య తన పుట్టినింటి యరణపు గవినిగా దెచ్చెనని చెప్పుదురుగాని యదియు పుక్కిటి పురాణమే. ఈతని పూర్వులు మొదటినుండియు రాయలవారి పూర్వులవద్దనే విద్వత్కవులుగా నుండి వారికి గృతు లిచ్చుచు వచ్చినట్లు గ్రంధ నిదర్శనములు గలవు. తిమ్మన పూర్వుడైన నందిమల్లనయు, మేనమామయైన మలయమారుతకవియు గృష్ణదేవరాయల తండ్రియైన నరసరాయల యాస్థానమునందుండి యిద్దఱును గలిసి వరాహపురాణమును దెనిగించి నరసరాజును దానికి గృతిపతినిజేసిరి. తిమ్మకవి తన పారిజాతాపహరణమున బ్రధమాశ్వాసములో గృష్ణుడు పారిజాతపుష్పమును రుక్మిణి కిచ్చుటవలన వచ్చిన కోపమును దీర్చుటకై సత్యభామకు మ్రొక్కెననియు, మ్రొక్కగా నాపడతి యెడమకాలితో నాతనితల దన్నెననియు, అందుల కాతడలుగక ముండ్లవంటి తనగగుర్పొడిచిన తలవెండ్రుకలు సోకి కాలు నొచ్చెనని యా ప్రియభార్య నూరార్చెననియు, ఆమె యంతటితోను బ్రసన్నురాలుగాక నాథుని నిష్ఠురోక్తులాడెననియు, ముద్దులు గులుకు పలుకులతో నీక్రింది పద్యములయందు జెప్పెను:-