ఈ పుట ఆమోదించబడ్డది

చ. సగరు పగాయె నింక విపినంబుల కేగుడు రాజ్యకాంక్షకుం

దగరు కుమారులార యని తల్లి వగ ల్మిగులంగ దోపగా

దొగరున రక్షగట్టి మది దోచక గద్గదఖిన్నకంఠయై

వగరుచుచున్న జూచి రఘువంశవరేణ్యుడు తల్లి కిట్లనున్.


అని చెప్పగా సంతోషించి యీప్రాసములతోనే భారత భాగవతపరముగా గూడ బద్యములను రచింపు మని యడుగగా నాకవీశ్వరుడు వరుసగా నీక్రింది రెండు పద్యములను జెప్పి తనప్రావీణ్యమును జూపెనట:-


చ. తొగరుచి కన్నుదోయి గడుదోచగ గర్ణుడు భీమసేనుపై

దగరు ధరాధరంబుపయి దాకినభ్ంగిని దాకి నొచ్చి తా

వగరుచుచున్ వెపం బరుగువాఱిన నచ్చటిరాజలోకముల్

నగరు సుయోధనాజ్ఞ మది నాటుటజేసి ధరాతలేశ్వరా.


చ. వగరపుమాత్రమే వరుడు వశ్యుడుకాడు సఖీనఖత్వ మె

న్న గరుడవాహనుండు మము నా డటు డించుటయెల్ల నుద్ధవా

తగ రని కాక మోహపులతాతనువైన విడంగ జూతురే

తొగరుచి యోషధీశునకు దోపగజేయునె వీడనాడగన్


అల్లసానిపెద్దన్నది మృదుశైలి; కవిత్వము సలక్షణముగాను మధురముగాను నుండును. ఈవిషయమునే కృష్ణరాయలు "కృతి రచింపుము మాకు శిరీషకుసుమవేశల సుధామయోక్తుల బెద్దనార్య" యన్నవాక్యము బోధించుచున్నది. మనుచరిత్రము శృంగారరస ప్రధానమయినదిగా నున్నది. ఆగ్రంథము సాధారణముగా సంస్కృతపద భూయిష్టముగా నున్నను, కొన్నిచోట్ల మనోహరముగా సంస్కృతాంధ్రపదములు రెండును సమానముగా గలిసినదిగాను నాలవయాశ్వాసము కేవలాంధ్రపదభూయిష్టమైనదిగాను నున్నది. ఈతని కవిత్వమునందలి పదవాక్యజటిలత్వమునుబట్టి "యల్లసానివాని యల్లిక బిగియును" అను