ఈ పుట ఆమోదించబడ్డది

అట్లు గారుత్మతహారమును బట్టున కిచ్చుటచే నాప్రధానచంద్రుడు "బట్టుమూర్తికి గిన్క రెట్టింప బచ్చలహార మర్పించె దిమ్మరుసుమౌళి" యని ప్రసిద్ధిగాంచెను.

ఈతనికిని బట్టుమూర్తికినిగల కాలవ్యత్యాసమునుబట్టి కూడ బయికథ విశ్వాసార్హ మయినదికాదు. కృష్ణదేవరాయనికి బుత్రసంతానము లేనట్టే యనేక స్థలములయందు జెప్పబడియున్నది. అచ్యుతదేవరాయలే కృష్ణదేవరాయని పుత్రుడని యొక చోటను, సదాశివదేవరాయలు కృష్ణదేవరాయని పుత్రుడని యొకచోటను, చెప్పబడెను గాని వానిసత్యమునుగూర్చి యింకను సందేహింప వలసియున్నది. కృష్ణదేవరాయని మరణకాలమునం దాతని కిద్దఱుకొమార్తలుండిరి. వారి కప్పటికి వివాహముకాలేదు. తరువాత తిరుమలదేవికొమార్తెను రామరాజును చిన్నాదేవికొమార్తెను దదనుజుడైన తిరుమల దేవరాయుడును పరిణయమైరి. ఇట్లు కర్ణాటరాజ్యమును మహోచ్చదశయందుంచి కృష్ణదేవరాయలు శుక్ల సంవత్సర వైశాఖమాసము మొదలుకొని వికృతిసంవత్సరము వఱకును ఇరువదియొక్క సంవత్సరములు రాజ్యముచేసి హూణశకము 1530 వ సంవత్సరమునందు గీర్తిశేషుడయ్యెను. అచ్యుతదేవరాయ లా సంవత్సరమున రాజ్యమునకువచ్చి, పండ్రెండుసంవత్సరములు పరిపాలనముచేసి, తిరుణపల్లి మొదలైన దేశములను జయించి పరలోక గతుడయ్యెను.